Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

శ్రీదేవి విజయం.. నాలుగు రోజుల పోరాటానికి తెర..! చైర్మన్‌ కుటుంబం దిగివచ్చిన వేళ

Author
Posted By Telangana Gontuka
| 08 Oct 2026, 07:23 PM | TELANGANA
శ్రీదేవి విజయం.. నాలుగు రోజుల పోరాటానికి తెర..!  చైర్మన్‌ కుటుంబం దిగివచ్చిన వేళ

వర్ధన్నపేట: నాలుగు రోజులుగా వర్ధన్నపేటలో ఉత్కంఠ రేపిన దళిత యువతి తుమ్మల శ్రీదేవి పోరాటం ఎట్టకేలకు ఫలించింది. తాను ప్రేమించిన పాలకుర్తి శ్రీకాంత్‌తోనే వివాహం జరిపించాలని పట్టువిడవకుండా ఆందోళన చేపట్టిన శ్రీదేవికి ప్రజాసంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సబ్బండ వర్గాలు అండగా నిలిచాయి. ఈ వ్యవహారం స్థానికంగా మొదలై మీడియా కథనాలు, సోషల్‌ మీడియాలో విస్తృతంగా వైరల్‌ కావడంతో రాష్ట్రస్థాయిలోనూ చర్చకు దారితీసింది. శ్రీకాంత్‌ తనను వివాహం చేసుకోవాలని డిమాండ్‌ చేస్తూ శ్రీదేవి కుటుంబ సభ్యులతో కలిసి చైర్మన్‌ కుటుంబం ఇంటి ఎదుట నాలుగు రోజులుగా దీక్ష కొనసాగించింది. రాత్రింబవళ్లు అక్కడే ఉంటూ తన డిమాండ్‌పై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేసింది. విషయం రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకోవడంతో పలువురు నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు దీక్షా స్థలానికి చేరుకుని శ్రీదేవికి సంఘీభావం ప్రకటించారు. “న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గేది లేదు” అన్న ఆమె పట్టుదలే ఈ పోరాటానికి కేంద్రబిందువుగా మారింది.
పార్టీల మద్దతు.. హైకమాండ్‌ దృష్టికి...
విషయం రోజురోజుకూ తీవ్రతరం కావడంతో అధికార కాంగ్రెస్‌ పార్టీలోనూ చర్చ మొదలైనట్లు సమాచారం. వ్యవహారం పార్టీ ప్రతిష్ఠపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న నేపథ్యంలో అధిష్ఠానం స్థాయిలోనూ దీనిపై దృష్టి సారించినట్లు తెలిసింది. మరోవైపు ప్రతిపక్ష పార్టీల నాయకులు కూడా యువతికి మద్దతుగా నిలిచారు. దీంతో సమస్య కేవలం కుటుంబ వ్యవహారంగా కాకుండా సామాజిక, రాజకీయ అంశంగా మారింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు జోక్యం చేసుకున్నట్లు సమాచారం. టీపీసీసీ అధికార ప్రతినిధి నిమ్మాని శేఖర్‌రావుతో కలిసి ఇరు కుటుంబాలతో చర్చలు జరిపి సమస్యకు పరిష్కారం చూపేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. పెద్దల సమక్షంలో చర్చలు జరిపి ఇరు కుటుంబాల అంగీకారంతో వివాహానికి మార్గం సుగమం చేశారు. ఈ మేరకు ఇరు కుటుంబాల మధ్య అంగీకార పత్రం కూడా రాసుకున్నట్లు సమాచారం.
దండలు మార్చి.. పసుపుతాడు కట్టి...
చర్చలు సఫలమై చివరకు చైర్మన్‌ కుటుంబం కూడా వివాహానికి అంగీకరించింది. శ్రీకాంత్‌, తుమ్మల శ్రీదేవి ఇంటి వద్ద పరస్పరం దండలు మార్చుకున్నారు. అనంతరం పసుపుతాడు కట్టడంతో నాలుగు రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. త్వరలోనే పెద్దల సమక్షంలో శాస్త్రోక్తంగా వివాహం నిర్వహించి, అనంతరం రిసెప్షన్‌ ఏర్పాటు చేస్తామని కుటుంబ సభ్యులు ప్రకటించినట్లు సమాచారం. నాలుగు రోజులపాటు ఎండా, వానా లెక్కచేయకుండా దీక్ష కొనసాగించిన శ్రీదేవి చివరకు తాను కోరుకున్న వ్యక్తితో వివాహానికి అంగీకారం సాధించడంతో ఆనందం వ్యక్తం చేసింది. “పట్టుదలతో పోరాడితే సమస్యకు పరిష్కారం దొరుకుతుందనే నమ్మకంతోనే వెనక్కి తగ్గలేదు” అన్న భావనను ఆమె వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఒక యువతి తన జీవిత భాగస్వామిని తానే ఎంచుకునే హక్కు కోసం సాగించిన పోరాటం.. ప్రజాసంఘాల మద్దతు.. రాజకీయ పార్టీల స్పందన.. మీడియా కథనాలు, సోషల్‌ మీడియా చర్చలతో చివరకు ఇరు కుటుంబాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. వివాహానికి ఇరు కుటుంబాలు అంగీకరించడంతో నాలుగు రోజుల పోరాటం ప్రేమ వివాహంతో విజయవంతంగా ముగిసింది

శ్రీదేవి విజయం.. నాలుగు రోజుల పోరాటానికి తెర..!  చైర్మన్‌ కుటుంబం దిగివచ్చిన వేళ - Additional Imageశ్రీదేవి విజయం.. నాలుగు రోజుల పోరాటానికి తెర..!  చైర్మన్‌ కుటుంబం దిగివచ్చిన వేళ - Additional Image