శ్రీదేవి విజయం.. నాలుగు రోజుల పోరాటానికి తెర..! చైర్మన్ కుటుంబం దిగివచ్చిన వేళ
పార్టీల మద్దతు.. హైకమాండ్ దృష్టికి...
విషయం రోజురోజుకూ తీవ్రతరం కావడంతో అధికార కాంగ్రెస్ పార్టీలోనూ చర్చ మొదలైనట్లు సమాచారం. వ్యవహారం పార్టీ ప్రతిష్ఠపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న నేపథ్యంలో అధిష్ఠానం స్థాయిలోనూ దీనిపై దృష్టి సారించినట్లు తెలిసింది. మరోవైపు ప్రతిపక్ష పార్టీల నాయకులు కూడా యువతికి మద్దతుగా నిలిచారు. దీంతో సమస్య కేవలం కుటుంబ వ్యవహారంగా కాకుండా సామాజిక, రాజకీయ అంశంగా మారింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు జోక్యం చేసుకున్నట్లు సమాచారం. టీపీసీసీ అధికార ప్రతినిధి నిమ్మాని శేఖర్రావుతో కలిసి ఇరు కుటుంబాలతో చర్చలు జరిపి సమస్యకు పరిష్కారం చూపేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. పెద్దల సమక్షంలో చర్చలు జరిపి ఇరు కుటుంబాల అంగీకారంతో వివాహానికి మార్గం సుగమం చేశారు. ఈ మేరకు ఇరు కుటుంబాల మధ్య అంగీకార పత్రం కూడా రాసుకున్నట్లు సమాచారం.
దండలు మార్చి.. పసుపుతాడు కట్టి...
చర్చలు సఫలమై చివరకు చైర్మన్ కుటుంబం కూడా వివాహానికి అంగీకరించింది. శ్రీకాంత్, తుమ్మల శ్రీదేవి ఇంటి వద్ద పరస్పరం దండలు మార్చుకున్నారు. అనంతరం పసుపుతాడు కట్టడంతో నాలుగు రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. త్వరలోనే పెద్దల సమక్షంలో శాస్త్రోక్తంగా వివాహం నిర్వహించి, అనంతరం రిసెప్షన్ ఏర్పాటు చేస్తామని కుటుంబ సభ్యులు ప్రకటించినట్లు సమాచారం. నాలుగు రోజులపాటు ఎండా, వానా లెక్కచేయకుండా దీక్ష కొనసాగించిన శ్రీదేవి చివరకు తాను కోరుకున్న వ్యక్తితో వివాహానికి అంగీకారం సాధించడంతో ఆనందం వ్యక్తం చేసింది. “పట్టుదలతో పోరాడితే సమస్యకు పరిష్కారం దొరుకుతుందనే నమ్మకంతోనే వెనక్కి తగ్గలేదు” అన్న భావనను ఆమె వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఒక యువతి తన జీవిత భాగస్వామిని తానే ఎంచుకునే హక్కు కోసం సాగించిన పోరాటం.. ప్రజాసంఘాల మద్దతు.. రాజకీయ పార్టీల స్పందన.. మీడియా కథనాలు, సోషల్ మీడియా చర్చలతో చివరకు ఇరు కుటుంబాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. వివాహానికి ఇరు కుటుంబాలు అంగీకరించడంతో నాలుగు రోజుల పోరాటం ప్రేమ వివాహంతో విజయవంతంగా ముగిసింది