Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

తెలంగాణలో బీసీ బిడ్డను సీఎం చేస్తాం: తీన్మార్‌ మల్లన్న

Author
Posted By Telangana Gontuka
| 07 Oct 2026, 08:42 PM | Politics, TELANGANA
తెలంగాణలో బీసీ బిడ్డను సీఎం చేస్తాం: తీన్మార్‌ మల్లన్న

కొత్తకోట : తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం వర్గాలకు రాజకీయ రాజ్యాధికారం సాధించడమే లక్ష్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న చేపట్టిన బీసీ రాజ్యాధికార యాత్ర 21వ రోజుకు చేరుకుంది. మంగళవారం దేవరకద్ర నియోజకవర్గంలోని కొత్తకోటకు చేరుకున్న మల్లన్నకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీసీ సంఘాల ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. అనంతరం కొత్తకోట సెంటర్‌లో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో ఆయన ప్రసంగించారు. బీసీల ఓట్లతో గెలిచి.. బీసీలపైనే రాజకీయ పెత్తనం చేయడం ఇక సాగదని వ్యాఖ్యానించారు. దేవరకద్ర నియోజకవర్గంలో మొత్తం 2,35,352 ఓట్లలో బీసీల ఓట్లు 1,47,247 ఉన్నాయని మల్లన్న పేర్కొన్నారు. రెడ్డి సామాజికవర్గానికి 11,206 ఓట్లు మాత్రమే ఉన్నాయని తెలిపారు. ముదిరాజ్‌, యాదవ, మున్నూరు కాపు, గౌడ, పద్మశాలి, రజక, నాయీబ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ తదితర బీసీ కులాలతో పాటు ఎస్సీ, ఎస్టీ, ముస్లిం వర్గాలు ఐక్యమైతే రాజకీయ సమీకరణాలు మారుతాయని అన్నారు. “మన ఓట్లు మనమే వేసుకుంటే మన రాజ్యం వస్తుంది. దేవరకద్రలో ఎవరు ఎమ్మెల్యే కావాలో ఇకపై బీసీలే నిర్ణయించాలి” అని పిలుపునిచ్చారు.
‘పందుల లెక్క ఉంది.. బీసీల లెక్క లేదు’..
2014లో కేసీఆర్‌ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేను ప్రస్తావించిన మల్లన్న.. పందులు, గాడిదలు, పశువులు, వాహనాల లెక్కలు కూడా సేకరించిన ప్రభుత్వం బీసీల కులాలవారీ జనాభా వివరాలను మాత్రం వెల్లడించలేదని విమర్శించారు. రాష్ట్రంలో 3.07 లక్షల పందులు, సుమారు రెండు వేల గాడిదలు ఉన్నట్లు లెక్కలు చెప్పారని, మరి ముదిరాజ్‌లు, యాదవులు, గౌడలు, పద్మశాలీలు ఎంతమంది ఉన్నారో ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేపట్టిన కులగణనలో బీసీల సంఖ్యను తగ్గించి చూపారని మల్లన్న ఆరోపించారు. పదేళ్లలో రెడ్డి సామాజికవర్గ జనాభా పెరిగినట్లు లెక్కల్లో చూపించి, బీసీల జనాభా తగ్గినట్లు చూపడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. “బీసీలకు పిల్లలు పుట్టలేదా?” అంటూ ప్రభుత్వ లెక్కలపై అనుమానాలు వ్యక్తం చేశారు. బీసీల రాజకీయ వాటాను తగ్గించేందుకే లెక్కలు తయారు చేస్తున్నారని ఆరోపించారు.
కామారెడ్డి డిక్లరేషన్‌ ఏమైంది..?
కాంగ్రెస్‌ ఎన్నికల ముందు ప్రకటించిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ అమలుపై మల్లన్న ప్రభుత్వాన్ని నిలదీశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఏడాదికి రూ.20 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల బీసీ సంక్షేమ నిధులు ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అయితే వాస్తవంగా బీసీ సంక్షేమానికి సుమారు రూ.2 వేల కోట్లే ఖర్చు చేశారని, మిగిలిన రూ.18 వేల కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. బీసీ విద్యార్థుల స్కాలర్‌షిప్‌లకు సుమారు రూ.1,980 కోట్లు అవసరమైతే రూ.365 కోట్లే ఖర్చు చేశారని మల్లన్న పేర్కొన్నారు.