తెలంగాణలో బీసీ బిడ్డను సీఎం చేస్తాం: తీన్మార్ మల్లన్న
‘పందుల లెక్క ఉంది.. బీసీల లెక్క లేదు’..
2014లో కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేను ప్రస్తావించిన మల్లన్న.. పందులు, గాడిదలు, పశువులు, వాహనాల లెక్కలు కూడా సేకరించిన ప్రభుత్వం బీసీల కులాలవారీ జనాభా వివరాలను మాత్రం వెల్లడించలేదని విమర్శించారు. రాష్ట్రంలో 3.07 లక్షల పందులు, సుమారు రెండు వేల గాడిదలు ఉన్నట్లు లెక్కలు చెప్పారని, మరి ముదిరాజ్లు, యాదవులు, గౌడలు, పద్మశాలీలు ఎంతమంది ఉన్నారో ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం చేపట్టిన కులగణనలో బీసీల సంఖ్యను తగ్గించి చూపారని మల్లన్న ఆరోపించారు. పదేళ్లలో రెడ్డి సామాజికవర్గ జనాభా పెరిగినట్లు లెక్కల్లో చూపించి, బీసీల జనాభా తగ్గినట్లు చూపడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. “బీసీలకు పిల్లలు పుట్టలేదా?” అంటూ ప్రభుత్వ లెక్కలపై అనుమానాలు వ్యక్తం చేశారు. బీసీల రాజకీయ వాటాను తగ్గించేందుకే లెక్కలు తయారు చేస్తున్నారని ఆరోపించారు.
కామారెడ్డి డిక్లరేషన్ ఏమైంది..?
కాంగ్రెస్ ఎన్నికల ముందు ప్రకటించిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలుపై మల్లన్న ప్రభుత్వాన్ని నిలదీశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఏడాదికి రూ.20 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల బీసీ సంక్షేమ నిధులు ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అయితే వాస్తవంగా బీసీ సంక్షేమానికి సుమారు రూ.2 వేల కోట్లే ఖర్చు చేశారని, మిగిలిన రూ.18 వేల కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. బీసీ విద్యార్థుల స్కాలర్షిప్లకు సుమారు రూ.1,980 కోట్లు అవసరమైతే రూ.365 కోట్లే ఖర్చు చేశారని మల్లన్న పేర్కొన్నారు.