Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

చైర్మన్‌ కుమారుడిపై ఆరోపణలు.. రెండో రోజూ దళిత యువతి పోరాటం

Author
Posted By Telangana Gontuka
| 06 Oct 2026, 07:24 PM | TELANGANA
చైర్మన్‌ కుమారుడిపై ఆరోపణలు.. రెండో రోజూ దళిత యువతి పోరాటం

నాలుగేళ్లుగా ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను శారీరకంగా ఉపయోగించుకున్నాడని, ఇప్పుడు పెళ్లి మాట ఎత్తగానే నిరాకరిస్తున్నాడని ఆరోపిస్తూ ఓ దళిత యువతి చేపట్టిన ఆందోళన రెండో రోజూ కొనసాగింది. వర్ధన్నపేట మున్సిపల్‌ చైర్మన్‌ పాలకుర్తి సారంగపాణి కుమారుడు శ్రీకాంత్‌పై యువతి ఈ ఆరోపణలు చేస్తోంది. తనకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేస్తూ మంగళవారం కూడా చైర్మన్‌ ఇంటి ఎదుట దీక్ష కొనసాగించింది. యువతి తెలిపిన వివరాల ప్రకారం.. కొంతకాలంగా శ్రీకాంత్‌, తాను ప్రేమించుకుంటున్నామని, పెళ్లి విషయంలో ఇటీవల ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని పేర్కొంది. వారం రోజుల క్రితం హనుమకొండలో శ్రీకాంత్‌ తనపై చేయి చేసుకున్నాడని ఆరోపిస్తూ సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. అక్కడ స్పందన లేదని పేర్కొంటూ వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజును ఫోన్‌లో న్యాయం చేయాలని కోరినట్లు చెప్పింది. తాను హైదరాబాద్‌లో ఉన్నానని, తిరిగి వచ్చాక కలుద్దామని ఎమ్మెల్యే చెప్పిన ఫోన్‌ సంభాషణను కూడా యువతి సోషల్‌ మీడియాలో విడుదల చేసింది.
ఈ నేపథ్యంలో సోమవారం వర్ధన్నపేటలోని మున్సిపల్‌ చైర్మన్‌ పాలకుర్తి సారంగపాణి ఇంటి ఎదుట కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నాయకులతో కలిసి టెంట్‌ వేసి ఆందోళన చేపట్టింది. తనను వివాహం చేసుకోవాలని, న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని డిమాండ్‌ చేసింది. పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళన విరమించి న్యాయపరంగా ముందుకు వెళ్లాలని సూచించినప్పటికీ యువతి దీక్ష కొనసాగించింది. రాత్రి వరకు అక్కడే వంటావార్పు నిర్వహించి నిరసన తెలిపింది.
**బీజేపీ నేతల సంఘీభావం**
మంగళవారం రెండో రోజు ఆందోళన కొనసాగుతుండగా మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్‌, వరంగల్‌ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంట రవికుమార్‌, రాష్ట్ర అధికార ప్రతినిధి డా. వన్నాల వెంకటరమణ అక్కడికి చేరుకుని బాధిత యువతికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అన్యాయం జరిగిందని పలుమార్లు న్యాయం కోసం కోరుతున్న యువతి విషయంలో సంబంధిత వ్యక్తులు, అధికారులు స్పందించకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రేమ పేరుతో మోసపోయినట్లు ఆరోపిస్తున్న యువతికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.
మున్సిపల్‌ చైర్మన్‌ కుమారుడిపై యువతి చేసిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత యువతికి న్యాయం జరగకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని బీజేపీ నేతలు హెచ్చరించారు.
**‘ఎమ్మెల్యే ఎందుకు స్పందించడం లేదు?’**
మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్‌ మాట్లాడుతూ.. బాధిత యువతికి న్యాయం జరిగేలా వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు తక్షణమే చొరవ తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. చైర్మన్‌ అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో ఈ విషయంలో రాజకీయ ఒత్తిళ్లు ఉండకూడదన్నారు. ఒక దళిత యువతి న్యాయం కోసం చైర్మన్‌ ఇంటి ఎదుట ఆందోళన చేస్తుంటే ఎమ్మెల్యే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. చైర్మన్‌ కుటుంబంతో గతంలో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆయన ప్రస్తావించారు. ఒకే ప్రాంతానికి చెందినవారిగా, బలహీన వర్గాలకు చెందినవారిగా కలిసి మెలిసి ఉన్న కుటుంబం నుంచి యువతికి అన్యాయం జరిగిందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ఉందన్నారు.
**‘అధికారాన్ని అడ్డుపెట్టుకుని సమస్యను పక్కదారి పట్టించొద్దు’**
బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్‌ మాట్లాడుతూ.. అధికార పార్టీకి చెందిన మున్సిపల్‌ చైర్మన్‌ కుటుంబానికి సంబంధించిన అంశం కావడంతో అధికారులు ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా చట్ట ప్రకారం వ్యవహరించాలని కోరారు. యువతి చేసిన ఆరోపణలను పూర్తిస్థాయిలో విచారించి వాస్తవాలను తేల్చాలని అన్నారు. బాధితురాలికి న్యాయం చేయడంలో ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన కొనసాగిస్తామని పేర్కొన్నారు.
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డా. వన్నాల వెంకటరమణ మాట్లాడుతూ.. దళిత యువతి న్యాయం కోసం రెండో రోజు కూడా చైర్మన్‌ ఇంటి ఎదుట దీక్ష చేస్తుండటం ఆందోళన కలిగించే విషయమన్నారు. యువతి ఆరోపణలపై ప్రభుత్వం, పోలీసు అధికారులు తక్షణమే స్పందించాలని డిమాండ్‌ చేశారు. చైర్మన్‌ కుమారుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుని బాధితురాలికి న్యాయం చేయాలని కోరారు. ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు తక్షణమే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. యువతి ఆందోళన చేస్తున్న సమయంలో ఎమ్మెల్యేతో ఫోన్‌లో మాట్లాడేలా ప్రయత్నాలు చేయడం, మరోవైపు అధికారులు పండుగ ఏర్పాట్లపై సమావేశాలు నిర్వహించడం సరికాదని బీజేపీ నేతలు విమర్శించారు. బాధితురాలి సమస్యకు ప్రాధాన్యం ఇచ్చి న్యాయం జరిగేలా చూడాలని కోరారు.
**‘పెద్దఎత్తున ఆందోళన చేస్తాం’**
బాధిత యువతికి న్యాయం జరగకపోతే పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని బీజేపీ నాయకులు హెచ్చరించారు. అధికార పార్టీకి చెందిన మున్సిపల్‌ చైర్మన్‌ కుటుంబంపై ఆరోపణలు వచ్చినందున విచారణ పారదర్శకంగా జరగాలని డిమాండ్‌ చేశారు. దళిత యువతికి న్యాయం జరిగే వరకు ఆమెకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కిసాన్‌ మోర్చా ఉపాధ్యక్షుడు మల్లాడి తిరుపతిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి బన్న ప్రభాకర్‌ తదితరులు పాల్గొని బాధిత యువతికి సంఘీభావం తెలిపారు.