Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఏవో వీరభద్రం వాట్సాప్‌ హ్యాక్‌.. రూ.లక్ష వరకు సైబర్‌ మోసం?

ఏవో వీరభద్రం వాట్సాప్‌ హ్యాక్‌.. రూ.లక్ష వరకు సైబర్‌ మోసం?

రాయపర్తి: వరంగల్‌ జిల్లా రాయపర్తి మండల వ్యవసాయ అధికారి (ఏవో) వీరభద్రం వాట్సాప్‌ ఖాతా హ్యాక్‌ కావడం కలకలం రేపింది. సైబర్‌ నేరగాళ్లు ఆయన వాట్సాప్‌ను తమ ఆధీనంలోకి తీసుకుని మండల, జిల్లా స్థాయి అధికారులు, బంధువులు, రైతులకు వ్యక్తిగతంగా మెసేజ్‌లు పంపినట్లు సమాచారం. తాను ఆస్పత్రిలో ఉన్నానని, అత్యవసరంగా డబ్బులు అవసరమని నమ్మించేలా మెసేజ్‌లు పంపినట్లు తెలుస్తోంది.
మెసేజ్‌లను నిజమని నమ్మిన కొందరు వ్యక్తులు నేరగాళ్లు సూచించిన ఖాతాలకు డబ్బులు పంపినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు దాదాపు రూ.లక్ష వరకు సైబర్‌ నేరగాళ్ల చేతికి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఎంతమంది నుంచి ఎంత మొత్తం వసూలు చేశారనే పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
వాట్సాప్‌ ద్వారా వచ్చిన మెసేజ్‌లను నమ్మి డబ్బులు పంపిన కొందరు రైతులు, పరిచయస్తులు అనంతరం ఏవో వీరభద్రానికి ఫోన్‌ చేసి విషయం ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఇప్పటికీ ఆయన పేరుతో మెసేజ్‌లు వస్తుండటంతో కొందరు రైతులు, అధికారులు అయోమయానికి గురవుతున్నారు.
వాట్సాప్‌ హ్యాక్‌ విషయాన్ని గుర్తించిన వీరభద్రం వెంటనే సైబర్‌ క్రైమ్‌ పోలీసులతో పాటు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. పోలీసులు సైబర్‌ నేరగాళ్లు ఉపయోగించిన ఫోన్‌ నంబర్లు, బ్యాంకు ఖాతాలు, లావాదేవీల వివరాలపై దర్యాప్తు చేస్తున్నారు. అధికారుల పేరుతో వచ్చే అత్యవసర డబ్బు అభ్యర్థనలను ధ్రువీకరించకుండా నగదు పంపవద్దని పోలీసులు సూచిస్తున్నారు.