Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

అప్పు పేరుతో ఆస్తుల వేట.. రాయపర్తిలో ప్రైవేట్‌ ఫైనాన్స్‌ ముఠా?

అప్పు పేరుతో ఆస్తుల వేట.. రాయపర్తిలో ప్రైవేట్‌ ఫైనాన్స్‌ ముఠా?

వరంగల్‌ : అత్యవసర పరిస్థితుల్లో చేతిలో డబ్బుల్లేక, బ్యాంకుల్లో రుణాలు దొరకక ఇబ్బందులు పడుతున్న సామాన్యుల నిస్సహాయతను కొందరు ప్రైవేట్‌ ఫైనాన్షియర్లు పెట్టుబడిగా మార్చుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అప్పు కావాలంటే ఆస్తిని తాకట్టు పెట్టడం కాకుండా తమ పేరిట ‘సేల్‌డీడ్‌’ రిజిస్ట్రేషన్‌ చేయాలంటూ షరతులు విధిస్తున్నారని సమాచారం. అప్పు, వడ్డీ చెల్లింపుల్లో జాప్యం జరిగితే కోట్ల విలువైన ఆస్తులను కారుచౌకగా కాజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.
రాయపర్తి కేంద్రంగా ఇలాంటి వ్యవహారాలు జరుగుతున్నాయనే ఆరోపణలు తాజాగా తెరపైకి వస్తున్నాయి. ఇదే తరహా వ్యవహారాలు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ ఉన్నాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వీటిపై సమగ్ర విచారణ జరిగితేనే అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
తాకట్టు కాదు.. సేల్‌డీడ్‌ ఎందుకు?
సాధారణంగా రుణం తీసుకునే సమయంలో ఆస్తిని తాకట్టు పెట్టడం ఆనవాయితీ. కానీ కొందరు ప్రైవేట్‌ ఫైనాన్షియర్లు మాత్రం పూర్తి స్థాయి సేల్‌డీడ్‌ను తమ పేరిట లేదా బినామీల పేర్లపై రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బాధితులకు భరోసా కల్పించేందుకు విడిగా తెల్లకాగితంపైనో, నోటరీ పత్రంపైనో ‘ఎంఓయూ’ రాసి.. నిర్ణీత గడువులో అసలు, వడ్డీ చెల్లిస్తే ఆస్తిని తిరిగి రిజిస్ట్రేషన్‌ చేస్తామని చెబుతున్నట్లు సమాచారం.
ఇక్కడే అసలు చిక్కు మొదలవుతోందని బాధితులు వాపోతున్నారు. రిజిస్ట్రేషన్‌ చేసిన సేల్‌డీడ్‌ ఒకవైపు.. ప్రైవేట్‌ ఒప్పందం మరోవైపు ఉండటంతో, గడువు దాటిన తర్వాత ఆస్తిపై హక్కులు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోందని చెబుతున్నారు.
రూ.3 నుంచి రూ.5.. వడ్డీ భారమే ఉచ్చు!
అప్పు ఇచ్చే సమయంలోనే నెలకు రూ.3 నుంచి రూ.5 వరకు వడ్డీ నిర్ణయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అంటే లక్ష రూపాయలకు నెలకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు వడ్డీ చెల్లించాల్సి వస్తుందని బాధితులు చెబుతున్నారు. నెలవారీ వడ్డీ చెల్లింపులో ఆలస్యం అయితే దానినే అసలులో కలిపి మళ్లీ వడ్డీ లెక్కిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దీంతో అసలు కంటే వడ్డీ భారం పెరిగి.. చివరకు అప్పు తీర్చలేని పరిస్థితి వస్తోందని సమాచారం. కుటుంబ అవసరాలు, వైద్య ఖర్చులు, పిల్లల చదువులు, వివాహాలు, వ్యాపార నష్టాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో తీసుకున్న అప్పు.. చివరకు సొంత ఇంటిని, భూమిని కోల్పోయే స్థాయికి తీసుకెళ్తోందనే ఆవేదన వ్యక్తమవుతోంది.
గడువు దాటితే.. ఆస్తి మాయం?
ఒప్పందంలో పేర్కొన్న గడువు ముగిసిన వెంటనే ఫైనాన్షియర్లు ఆస్తులను తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తమ పేరిట ఉన్న సేల్‌డీడ్‌ను ఆధారంగా చేసుకుని బాధితులకు తెలియకుండానే మూడో వ్యక్తులకు ఆస్తులను విక్రయిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
మరికొన్ని సందర్భాల్లో అనుచరులతో కలిసి ఇళ్లు, స్థలాల వద్దకు వెళ్లి ఒత్తిడి తెస్తున్నారని బాధితులు చెబుతున్నారు. అసలుతో పాటు భారీగా పెరిగిన వడ్డీ చెల్లిస్తేనే ఆస్తి విషయంలో మాట్లాడతామంటూ ఒత్తిడి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

రాయపర్తి నుంచి ఉమ్మడి జిల్లాకు విస్తరించిందా?
రాయపర్తి కేంద్రంగా ప్రైవేట్‌ ఫైనాన్స్‌ పేరుతో సాగుతున్న వ్యవహారాలపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పద్ధతుల్లో మరెంతమంది ఆస్తులు చేతులు మారాయి? ఎంతమంది బాధితులు ఉన్నారు? ఎన్ని సేల్‌డీడ్లు ఈ తరహాలో రిజిస్టర్‌ అయ్యాయి? వాటి వెనుక ఒకే ముఠా ఉందా? బినామీల పాత్ర ఏంటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అప్పు పేరుతో ఆస్తుల వేట.. రాయపర్తిలో ప్రైవేట్‌ ఫైనాన్స్‌ ముఠా? - Additional Image

అదే విధంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటి వ్యవహారాలు కొనసాగుతున్నాయా? అన్న కోణంలో అధికారులు విచారణ చేపడితే అసలు గుట్టు బయటపడే అవకాశం ఉంది. అవసరంలో ఉన్నవారికి అప్పు ఇవ్వడం తప్పు కాకపోయినా.. వారి నిస్సహాయతను ఆసరాగా చేసుకుని ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరిగితే మాత్రం అది తీవ్రమైన అంశమే. బాధితులు ముందుకు వస్తే వారి ఫిర్యాదుల ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

అప్పు పేరుతో ఆస్తుల వేట.. రాయపర్తిలో ప్రైవేట్‌ ఫైనాన్స్‌ ముఠా? - Additional Image