Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఉమ్మడి వరంగల్‌లో గర్జించిన పాలిటెక్నిక్ విద్యార్థులు

Author
Posted By Telangana Gontuka
| 26 Sep 2026, 09:13 PM | EDITORIAL, NATIONAL, TELANGANA
ఉమ్మడి వరంగల్‌లో గర్జించిన పాలిటెక్నిక్ విద్యార్థులు

వరంగల్: జీవో 97ను వ్యతిరేకిస్తూ తెలంగాణలో ప్రారంభమైన పాలిటెక్నిక్ విద్యార్థుల పోరాటం ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ తీవ్రరూపం దాల్చింది. వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో విద్యార్థులు ర్యాలీలు, రాస్తారోకోలు, ధర్నాలు, కలెక్టరేట్ ముట్టడులతో తమ నిరసనను వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్ విద్యను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకెళ్లడంపై విద్యార్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
వరంగల్ నగరంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులు ర్యాలీగా ములుగురోడ్డు జంక్షన్‌కు చేరుకుని రాస్తారోకో నిర్వహించారు. హనుమకొండలో విద్యార్థులతో పాటు అధ్యాపకులు, సిబ్బంది నిరసనలకు దిగారు. మహబూబాబాద్‌లో కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. కేసముద్రంలోనూ రాస్తారోకో జరిగింది. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో విద్యార్థులు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ సెంటర్ వద్ద బైఠాయించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం పాలిటెక్నిక్ విద్యార్థులు జిల్లా కేంద్రంలో ఆందోళన చేపట్టారు.
ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లాలో విద్యార్థుల నిరసనలు రోజురోజుకూ విస్తరించాయి. తరగతుల బహిష్కరణ, రాస్తారోకోలు, ధర్నాలతో పాటు జిల్లాల వారీగా అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. జీవో 97ను ఉపసంహరించాలని, పాలిటెక్నిక్ విద్యను ప్రస్తుత సాంకేతిక విద్యాశాఖ, ఎస్బీటెట్ పరిధిలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు.
35 రోజుల తర్వాత కీలక మలుపు...
విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రుల ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం కే.కేశవరావు నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు, పాలిటెక్నిక్ జేఏసీ ప్రతినిధులతో చర్చలు జరిపింది. అనంతరం ఎస్బీటెట్, సాంకేతిక విద్యా కమిషనరేట్‌లను యథాతథంగా కొనసాగించాలని, వాటిని శక్తి విభాగం/స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి మార్చకూడదని సూచించినట్లు వెల్లడైంది. ఇప్పటికే ప్రవేశాలు పొందిన విద్యార్థులు ప్రస్తుత విధానంలోనే కొనసాగుతారని స్పష్టత ఇచ్చింది. జీవో 97లో సంబంధిత నిబంధనను సవరించాలని కమిటీ సూచించింది. దీంతో సుమారు 35 రోజులుగా కొనసాగుతున్న పాలిటెక్నిక్ జేఏసీ సహాయ నిరాకరణ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 21న తాత్కాలికంగా విరమించింది. అయితే భవిష్యత్‌లో చేరే విద్యార్థుల విషయంలో యూనివర్సిటీ అఫిలియేషన్ అంశం పరిశీలనలో ఉండటంతో పూర్తి స్పష్టత కోసం విద్యార్థులు సవరించిన ప్రభుత్వ ఉత్తర్వు కోసం ఎదురుచూస్తున్నారు.
పోరాటం ఆగినా.. పర్యవేక్షణ కొనసాగింపు...
ప్రభుత్వం నుంచి అధికారికంగా సవరించిన జీవో వెలువడే వరకు తమ డిమాండ్లపై అప్రమత్తంగా ఉంటామని విద్యార్థి సంఘాలు తెలిపాయి. సెప్టెంబర్ 25లోపు కొత్త ఉత్తర్వులు రాకపోతే పరీక్షల బహిష్కరణ సహా మళ్లీ ఆందోళన కార్యక్రమాలు చేపడతామని పాలిటెక్నిక్ జేఏసీ హెచ్చరించింది. అయితే హై లెవల్ కమిటీ సూచనలతో ప్రస్తుతం చదువుతున్న పాలిటెక్నిక్ విద్యార్థుల విద్యా విధానం, ఎస్బీటెట్ పరిధి, సాంకేతిక విద్యా వ్యవస్థ కొనసాగింపుపై కీలకమైన భరోసా లభించినట్లైంది. ఇక ప్రభుత్వం జారీ చేయనున్న సవరించిన జీవోపైనే అందరి దృష్టి నెలకొంది.

ఉమ్మడి వరంగల్‌లో గర్జించిన పాలిటెక్నిక్ విద్యార్థులు - Additional Imageఉమ్మడి వరంగల్‌లో గర్జించిన పాలిటెక్నిక్ విద్యార్థులు - Additional Imageఉమ్మడి వరంగల్‌లో గర్జించిన పాలిటెక్నిక్ విద్యార్థులు - Additional Image