Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

రూ.300 దర్శనం టికెట్లకు భారీ డిమాండ్‌!

రూ.300 దర్శనం టికెట్లకు భారీ డిమాండ్‌!

తిరుమల: శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల ఆన్‌లైన్‌ బుకింగ్‌పై భక్తుల్లో వ్యక్తమవుతున్న సందేహాలకు టీటీడీ వివరణ ఇచ్చింది. భారీ డిమాండ్‌ కారణంగానే టికెట్లు తక్కువ సమయంలో పూర్తవుతున్నాయని, ఆన్‌లైన్‌ బుకింగ్‌ వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తోందని స్పష్టం చేసింది. Google Cloud Platform, Load Balancing, Auto Scaling, Distributed Architecture, Horizontal Scaling వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవస్థను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. టికెట్ల విడుదల సమయంలో ప్రత్యేక టెక్నికల్‌ వార్‌రూమ్‌ ఏర్పాటు చేసి అప్లికేషన్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, లావాదేవీలు, భద్రతను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొంది.
రూ.2.69 లక్షల కోటా.. 24 లక్షల వరకు డిమాండ్‌...
అధిక డిమాండ్‌ సమయంలో సుమారు 6 లక్షల మంది యూజర్లు టికెట్ల కోసం ప్రయత్నిస్తుండగా, ఒక్కొక్కరు సగటున నలుగురు కుటుంబ సభ్యుల కోసం ప్రయత్నిస్తే దాదాపు 24 లక్షల టికెట్లకు డిమాండ్‌ ఏర్పడే అవకాశం ఉందని టీటీడీ తెలిపింది. అయితే అందుబాటులో ఉన్న కోటా సుమారు 2.69 లక్షలు మాత్రమే కావడంతో డిమాండ్‌ దాదాపు 9 రెట్లు అధికంగా ఉంటుందని వివరించింది. ఒకేసారి భారీ సంఖ్యలో అభ్యర్థనలు వచ్చినప్పుడు బ్యాక్‌ఎండ్‌ వ్యవస్థలపై భారం పడకుండా వర్చువల్‌ క్యూ విధానాన్ని ఉపయోగిస్తున్నట్లు టీటీడీ తెలిపింది. ఇది టికెట్లు నిరాకరించేందుకు కాదని, అధిక ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు ఉపయోగించే సాంకేతిక విధానమని స్పష్టం చేసింది. ‘స్లాట్‌ అన్‌అవైలబుల్‌’ సందేశం రావడం టికెట్లు తక్కువ సమయంలో పూర్తవడం వల్ల కూడా జరిగే అవకాశం ఉందని తెలిపింది.
పేమెంట్‌ విఫలమైతే...
ఆన్‌లైన్‌ చెల్లింపులు టీటీడీ వ్యవస్థతో పాటు పేమెంట్‌ గేట్‌వేలు, బ్యాంకింగ్‌, యూపీఐ నెట్‌వర్క్‌లపై ఆధారపడి ఉంటాయని పేర్కొంది. అందువల్ల లావాదేవీ విఫలమైన ప్రతిసారీ టీటీడీ బుకింగ్‌ వ్యవస్థలోనే సమస్య ఉందని భావించరాదని సూచించింది. భక్తుల ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా ఆన్‌లైన్‌ బుకింగ్‌, డేటాబేస్‌ పనితీరు, హై-లోడ్‌ నిర్వహణ, భద్రత, యాంటీ-బాట్‌ విధానాలు, పేమెంట్‌ ప్రక్రియలను నిరంతరం మెరుగుపరుస్తున్నట్లు టీటీడీ తెలిపింది. గత ట్రాఫిక్‌ నమూనాలు, భవిష్యత్‌ డిమాండ్‌ను అంచనా వేసి మౌలిక సదుపాయాలను పెంచుతున్నట్లు పేర్కొంది. ఇతర ఆలయాల దర్శన, సేవా కోటాలు ఇదే విధానంలో విడుదలవుతున్నా అక్కడ డిమాండ్‌ తక్కువగా ఉండటంతో బుకింగ్‌ సజావుగా సాగుతోందని తెలిపింది. భారీ డిమాండ్‌ సమయంలో ప్రతి బుకింగ్‌ ప్రయత్నం విజయవంతం కావడం సాధ్యం కాదని, ఒక్కసారి టికెట్‌ లభించకపోవడాన్ని సాంకేతిక వైఫల్యంగా భావించవద్దని టీటీడీ భక్తులను కోరింది. సోషల్‌ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది.