Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

రిమ్స్‌లో చిన్నారుల మరణాలు ప్రభుత్వ నిర్లక్ష్యమే....కల్వకుంట్ల కవిత

Author
Posted By Telangana Gontuka
| 23 Sep 2026, 05:49 PM | TELANGANA
రిమ్స్‌లో చిన్నారుల మరణాలు ప్రభుత్వ నిర్లక్ష్యమే....కల్వకుంట్ల కవిత

ఆదిలాబాద్: ఆదిలాబాద్ రిమ్స్‌లోని ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగం (ఎస్ఎన్‌సీయూ)లో జరిగిన అగ్నిప్రమాదంలో ఐదుగురు చిన్నారులు మృతి చెందిన నేపథ్యంలో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత బుధవారం రిమ్స్‌ను సందర్శించి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అనంతరం బాధిత కుటుంబాలను పరామర్శించి ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. రిమ్స్‌లో చిన్నారుల మరణాలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని కవిత ఆరోపించారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా కాకుండా ప్రభుత్వ వైఫల్యంగా చూడాలని అన్నారు. ఆదిలాబాద్ జిల్లాను ముఖ్యమంత్రి దత్తత తీసుకున్నానని చెప్పిన నేపథ్యంలో ఐదుగురు చిన్నారులు మృతి చెందినా ముఖ్యమంత్రి ఘటనాస్థలికి రాకపోవడంపై ప్రశ్నించారు. ఆరోగ్యశాఖ మంత్రి కూడా బాధితులను పరామర్శించి వెళ్లారని విమర్శించారు. రిమ్స్‌లో 150 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా సగం మంది కూడా లేరని, నర్సులు, శానిటేషన్ సిబ్బంది కొరత ఉందని కవిత ఆరోపించారు. 150 ఏసీలకు ఒక్క మెకానిక్ కూడా లేరని, కేవలం ముగ్గురు ఎలక్ట్రీషియన్లు ఉన్నారని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ కింద సుమారు రూ.500 కోట్ల బకాయిలు రావాల్సి ఉన్నాయని తెలిపారు.
బాధిత కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని కవిత డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫోరెన్సిక్, ఫైర్ సేఫ్టీ, విద్యుత్, మౌలిక వసతులపై సమగ్ర ఆడిట్ నిర్వహించాలని కోరారు. రాష్ట్రంలోని ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ పరిస్థితులు మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో శిశువులు, గర్భిణుల మరణాలు, వైద్య ఆరోగ్య సేవలపై తమ పార్టీ తరఫున ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి సమగ్ర అధ్యయనం చేయనున్నట్లు కవిత తెలిపారు. జిల్లాకు సంబంధించిన హెల్త్ ప్రొఫైల్‌ను అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని చెప్పారు. పెండింగ్ ఆరోగ్య బిల్లులను నెల రోజుల్లో చెల్లించాలని, ఆదివాసీ ప్రాంతాలకు రహదారులు నిర్మించాలని, ఎస్టీల కోసం వస్తున్న నిధులపై లెక్క చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నెల రోజుల్లోగా చర్యలు తీసుకోకపోతే ఆదివాసీలతో కలిసి ఆదిలాబాద్‌ను ఘెరావ్ చేస్తామని హెచ్చరించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తామని, పరిష్కారం లభించే వరకు పోరాటం కొనసాగిస్తామని కవిత అన్నారు.