కారులో రూ.8.98 కోట్ల విదేశీ బంగారం పట్టివేత

హైదరాబాద్: కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న కారులో అక్రమంగా తరలిస్తున్న 5.83 కిలోల విదేశీ బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జాతీయ రహదారిపై వాహనాన్ని అడ్డుకుని తనిఖీ చేయగా, సీటు కింద మూడు ప్యాకెట్లలో దాచిన 5,832.90 గ్రాముల బంగారం లభించింది. దీని విలువ సుమారు రూ.8.98 కోట్లుగా అంచనా వేశారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేసి న్యాయస్థానం ఆదేశాల మేరకు జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. బంగారం అక్రమ రవాణా వెనుక ఉన్న వ్యక్తులపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.