పోలీస్‌ రెజ్లింగ్‌ క్లస్టర్‌లో రాధికకు కాంస్య పతకం

హైదరాబాద్‌: 75వ అఖిల భారత పోలీస్‌ రెజ్లింగ్‌ క్లస్టర్‌-2026లో మహిళల 90 కిలోలకుపైగా ఆర్మ్‌ రెజ్లింగ్‌ విభాగంలో కాంస్య పతకం సాధించిన డబ్ల్యూపీసీ జి. రాధికను తెలంగాణ డీజీపీ సి.వి. ఆనంద్‌ అభినందించారు. తెలంగాణ పోలీస్‌ స్పోర్ట్స్‌ మీట్‌ క్యాలెండర్‌ను అఖిల భారత పోలీస్‌ స్పోర్ట్స్‌ మీట్‌ క్యాలెండర్‌తో అనుసంధానం చేయడం, వివిధ క్రీడల్లో క్లస్టర్‌ విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా సిబ్బందికి మరిన్ని అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. జాతీయ స్థాయి పోటీలకు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యే అవకాశం కలుగుతోందన్నారు. రాధిక విజయం తెలంగాణ పోలీస్‌లోని ప్రతిభ, అంకితభావానికి ప్రతీక అని పేర్కొంటూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.