భారత్–పాక్ సరిహద్దులో చొరబాటు యత్నం.. ఇద్దరు మృతి
తరన్‌తారన్: పంజాబ్‌లోని తరన్‌తారన్ జిల్లాలో భారత్–పాక్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద చొరబాటుకు యత్నించిన ఇద్దరు వ్యక్తులను బీఎస్‌ఎఫ్ కాల్చిచంపింది. రాజోకే బోర్డర్ అవుట్‌పోస్టు సమీపంలో ముగ్గురు వ్యక్తులు పాకిస్థాన్ వైపు నుంచి భారత భూభాగంలోకి వస్తుండగా బీఎస్‌ఎఫ్ సిబ్బంది పలుమార్లు హెచ్చరించారు. వారు వెనక్కి తగ్గకుండా ముందుకు రావడంతో కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మూడో వ్యక్తి పాకిస్థాన్ వైపు పరారైనట్లు వెల్లడించారు. మృతుల గుర్తింపుపై దర్యాప్తు కొనసాగుతోంది.