చంద్రబాబుకు రైతుల కష్టాలు బాగా తెలుసు: లోకేశ్

అన్నమయ్య జిల్లా: రైతు కుటుంబంలో పుట్టిన సీఎం చంద్రబాబు నాయుడికి రైతుల కష్టాలు, సమస్యలపై పూర్తి అవగాహన ఉందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. మదనపల్లెలో రాయలసీమ హార్టికల్చర్ హబ్‌, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాయలసీమలో పాదయాత్ర సందర్భంగా రైతుల సమస్యలను స్వయంగా చూశానని, వారి కష్టాలను విన్నానని తెలిపారు. 1997లోనే చంద్రబాబు ఇజ్రాయెల్ నుంచి డ్రిప్ ఇరిగేషన్‌ను తీసుకొచ్చి రైతులకు పరిచయం చేశారని లోకేశ్ పేర్కొన్నారు. తాను చేపట్టిన యువగళం పాదయాత్ర రాయలసీమ నుంచే ప్రారంభమైందని, ఆ సమయంలో ఎదురైన ఇబ్బందులను గుర్తుచేసుకున్నారు. రాయలసీమ ప్రజల ఆశీస్సులతోనే పాదయాత్రను కొనసాగించగలిగామని తెలిపారు.