బెల్టుషాపు నిర్వాహకుడిపై సర్పంచ్ ఫిర్యాదు
జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం విశ్వనాథపురంలో బెల్టుషాపు నిర్వహిస్తున్న వ్యక్తిని ప్రశ్నించిన మహిళా సర్పంచ్‌పై దాడి జరిగినట్లు ఫిర్యాదు నమోదైంది. గ్రామంలో బెల్టుషాపులు నిర్వహించవద్దని గ్రామసభలో తీర్మానం చేసినప్పటికీ ఓర్సు శ్రీను మద్యం విక్రయిస్తున్నాడని సర్పంచ్ గుర్రపు యాదమ్మ ఆరోపించారు. అక్రమ మద్యం విక్రయాల ఫొటోలు తీసేందుకు వెళ్లిన పంచాయతీ సిబ్బందిని శ్రీను దూషించి బెదిరించాడని తెలిపారు. దీనిపై ప్రశ్నించేందుకు వెళ్లిన తనపై శ్రీను, అతని తండ్రి, ముగ్గురు కుమారులు, భార్య కలిసి దాడి చేశారని సర్పంచ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. అడ్డుకోబోయిన తన భర్త, కుమారుడిపైనా దాడి చేశారని తెలిపారు. ఘటనపై స్టేషన్‌ఘన్‌పూర్ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.