షాద్‌నగర్‌లో పట్టపగలే దౌర్జన్యం.. హెచ్చరిక బోర్డు ధ్వంసం

షాద్‌నగర్‌: పట్టణంలోని పరిగి రోడ్డులో గల మున్సిపల్‌ స్థలంలోకి కొందరు అక్రమంగా ప్రవేశించి హెచ్చరిక బోర్డును ధ్వంసం చేసిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. సర్వే నంబర్‌ 240పీలోని ఎల్‌పీ నంబర్‌ 8/90కు సంబంధించిన 896 చదరపు గజాల స్థలం మున్సిపాలిటీ ఆధీనంలో ఉందని కమిషనర్‌ సునీతారెడ్డి తెలిపారు. రామచందర్‌, రాజశేఖర్‌ తదితరులు స్థలంలోకి ప్రవేశించి బోర్డును ధ్వంసం చేసినట్లు స్థానికులు ఆరోపించారు. 150 గజాల స్థలంపై కొందరు హక్కు వాదన చేస్తున్నారని, దీనిపై కోర్టులో వివాదం నడుస్తోందని కమిషనర్‌ తెలిపారు. ఫేక్‌ డాక్యుమెంట్లతో కబ్జాకు యత్నిస్తే చర్యలు తీసుకుంటామని, ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు స్పష్టం చేశారు.