దేశ సేవ చేస్తూ.. క్రీడల్లోనూ సత్తా చాటిన వినయ్ యాదవ్

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన బొల్లు వెంకన్న–అనిత దంపతుల కుమారుడు బొల్లు వినయ్ యాదవ్ అథ్లెటిక్స్‌లో సత్తా చాటాడు. హనుమకొండ జేఎన్‌ఎస్‌ స్టేడియంలో ఈ నెల 26, 27 తేదీల్లో నిర్వహించిన 12వ తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 800 మీటర్ల పరుగు పందెంలో పాల్గొని కాంస్య పతకం సాధించాడు. ప్రస్తుతం ఆర్మీలో సేవలందిస్తున్న వినయ్ యాదవ్ దేశ రక్షణ విధులు నిర్వహిస్తూనే క్రీడలపై ఆసక్తిని కొనసాగిస్తూ రాష్ట్రస్థాయి పోటీల్లో పతకం సాధించడం విశేషం. పేద కుటుంబం నుంచి ఎదిగి సాధించిన ఈ విజయం తల్లిదండ్రులకు, పెగడపల్లి గ్రామానికి గర్వకారణంగా నిలిచింది. వినయ్ యాదవ్‌ను గ్రామస్థులు, మండల ప్రజలు అభినందించారు.