కాళేశ్వరం బ్యారేజీల రిపేర్‌కు కార్యాచరణ

హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల సమగ్ర పునరుద్ధరణ పనులను నవంబర్‌ రెండో వారంలో ప్రారంభించి, 2027 వర్షాకాలం ప్రారంభానికి ముందే పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విషయాన్ని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్‌ బేగంపేట కుందన్‌బాగ్‌లోని తన అధికారిక క్యాంపు కార్యాలయంలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో మంత్రి బ్యారేజీల పునరుద్ధరణ ప్రతిపాదనలపై సమీక్ష నిర్వహించారు. మూడు బ్యారేజీల భద్రతను మరింత పటిష్టం చేయడంతోపాటు, వాటి నిర్వహణ సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో పునరుద్ధరించేందుకు అవసరమైన డిజైన్లను ప్రభుత్వం ఖరారు చేసిందని తెలిపారు.