ఇల్లు కూలి కుటుంబం నిరాశ్రయం

హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పంతిని గ్రామంలో భారీ వర్షాలకు ఇల్లు కూలిపోయింది. గ్రామానికి చెందిన నస్కురి రాజేందర్‌ ఇంటి మట్టి గోడలు వర్షాలకు నాని బలహీనపడి గురువారం అర్ధరాత్రి పూర్తిగా కూలిపోయాయి. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే ఇంట్లోని నిత్యావసర సరుకులు, వంట సామగ్రి, బట్టలు బురదలో కూరుకుపోయి తీవ్ర నష్టం వాటిల్లింది. ఉన్న ఒక్క ఇల్లు కూలిపోవడంతో రోడ్డున పడ్డామని, ప్రభుత్వం ఆదుకోవాలని రాజేందర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే పరిశీలించి పంచనామా నిర్వహించి పరిహారం అందించడంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని బాధిత కుటుంబం కోరింది.