ఎంజీఎం ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలి: అరూరి రమేష్
వరంగల్: ఎంజీఎం ఆసుపత్రి వద్ద జరిగిన ఘటనలో గాయపడిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ను వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ పరామర్శించారు. ఎంజీఎం ఆసుపత్రిలో పెచ్చులు ఊడిపడి గాయపడిన రోగులను పరామర్శించేందుకు వెళ్లిన వినయ్‌భాస్కర్‌ను పోలీసులు అడ్డుకుని దాడి చేశారని ఆయన ఆరోపించారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యేపై పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఘటనపై ప్రభుత్వం వెంటనే సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను ప్రశ్నించే గొంతులను పోలీసు బలంతో అణచివేయాలనుకోవడం ప్రజాస్వామ్యంలో ఆమోదయోగ్యం కాదని అరూరి రమేష్ అన్నారు.