కే.ఆర్. నాగరాజు చొరవతో ప్రేమజంటకు పెళ్లి
ప్రియుడు శ్రీకాంత్‌తో వివాహం జరిపించాలని కోరుతూ నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్న దళిత యువతి శ్రీదేవి దీక్షకు ఎట్టకేలకు ముగింపు లభించింది. వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు చొరవతో శ్రీకాంత్, ఆయన కుటుంబ సభ్యులు వివాహానికి అంగీకరించారు. దీంతో ఇరువర్గాల కుటుంబ సభ్యుల సమక్షంలో శ్రీకాంత్–శ్రీదేవి వివాహం జరిగింది.
సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు ఎమ్మెల్యే నాగరాజు ఇరువర్గాల కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు. కుటుంబాల మధ్య ఉన్న విభేదాలను తొలగించి యువజంట భవిష్యత్తుకు భరోసా కల్పించేలా చర్చలు కొనసాగించారు. చివరకు శ్రీకాంత్ కుటుంబ సభ్యులు వివాహానికి అంగీకారం తెలపడంతో నాలుగు రోజులుగా కొనసాగుతున్న శ్రీదేవి దీక్ష విరమించింది.
అనంతరం శ్రీకాంత్–శ్రీదేవి పరస్పరం వివాహ దండలు మార్చుకున్నారు. దీంతో అక్కడ ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న దళిత సంఘాల ప్రతినిధులు, మహిళలు, కుటుంబ సభ్యులు, పట్టణవాసులు నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రేమ వివాహం చేసుకున్న ఎమ్మెల్యే.. ప్రేమజంటకు అండగా
తాను కూడా ప్రేమ వివాహం చేసుకున్న వ్యక్తిగా ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు యువజంట సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపినట్లు కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు తెలిపారు. శ్రీదేవి నాలుగు రోజులుగా దీక్ష చేస్తున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఇరువర్గాలతో మాట్లాడి వివాహానికి మార్గం సుగమం చేశారు.
ప్రేమించిన ఇద్దరు యువతీ యువకులు కలిసి జీవించాలని నిర్ణయించుకున్నప్పుడు కుటుంబాల మధ్య అపార్థాలను తొలగించి సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలని ఎమ్మెల్యే సూచించినట్లు తెలిపారు. ఆయన చొరవతో దీక్షకు తెరపడటంతో కుటుంబ సభ్యులు, మద్దతుదారులు హర్షం వ్యక్తం చేశారు.
నూతన దంపతులకు ఎమ్మెల్యే దంపతుల ఆశీర్వాదం
వివాహం అనంతరం శ్రీకాంత్–శ్రీదేవి ఎమ్మెల్యే నాగరాజు నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు, ఆయన సతీమణి మల్లీశ్వరి నూతన దంపతులకు పెళ్లి వస్త్రాలు అందజేసి ఆశీర్వదించారు.
కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్‌రావు, వరంగల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు మహమ్మద్ ఆయుబ్, ఇల్లంద మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, ఐనవోలు దేవస్థానం చైర్మన్ ప్రభాకర్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ అబ్బిడి రాజిరెడ్డి, మండల అధ్యక్షుడు పోశాల వెంకన్న, 1వ డివిజన్ అధ్యక్షుడు చిర్ర రాముగౌడ్, సీనియర్ నాయకులు బుద్దె పెద్దన్న, వర్ధన్నపేట మండల యువజన అధ్యక్షుడు భానుప్రసాద్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.