వర్ధన్నపేట: వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని డీసీ తండా దుర్గమ్మ గుడి ప్రాంగణంలో సేవాలాల్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ను మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ ప్రారంభించారు. తొలి మ్యాచ్లో దమ్మన్నపేట, డీసీ తండా-2 జట్ల క్రీడాకారులకు టాస్ వేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా అరూరి రమేష్ మాట్లాడుతూ.. నిత్యం చదువులతో బిజీగా ఉండే యువతకు క్రీడలు మానసికోల్లాసాన్ని అందిస్తాయన్నారు. విద్య ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యమని, విద్యతో పాటు క్రీడల్లోనూ పోటీ తత్వాన్ని అలవరుచుకోవాలని సూచించారు. క్రీడల్లో ప్రతిభ చూపిన వారికి మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. ఆటలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని తెలిపారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు టోర్నమెంట్ నిర్వహించిన సేవాలాల్ యూత్ సభ్యులను అభినందించారు. తన తండ్రి అరూరి గట్టుమల్లు పేరిట ఏజీఎఫ్ ఏర్పాటు చేసి పదేళ్లుగా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ అంగోతు అరుణ, కౌన్సిలర్లు, పట్టణ నాయకులు పాల్గొన్నారు.