🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 07 October 2026, 2:12 pm Posted by : satla anil kumar

క్రీడలు యువతకు స్ఫూర్తిదాయకం

News Image
వర్ధన్నపేట: యువత చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని కేంద్ర ఖాదీ, చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం అన్నారు. వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని డీసీ తండా దుర్గమ్మ గుడి ప్రాంగణంలో సేవాలాల్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు.
తొలి మ్యాచ్‌లో కేశవపురం, ఎన్‌ఎస్‌ తండా జట్లకు టాస్ వేసిన ఈగ మల్లేశం.. అనంతరం స్వయంగా బ్యాట్ పట్టి బ్యాటింగ్ చేసి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు యువతలో శారీరక దృఢత్వంతోపాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని అన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి టోర్నమెంట్లు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. క్రీడాకారులు క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. యువతలో అద్భుతమైన ప్రతిభ దాగి ఉందని, సరైన అవకాశాలు లభిస్తే రాష్ట్ర, జాతీయ స్థాయిలో సత్తా చాటగలరని అన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడాకారులకు కల్పిస్తున్న ప్రత్యేక రిజర్వేషన్లను యువత సద్వినియోగం చేసుకుని ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. సేవాలాల్ యూత్ సభ్యులు గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమన్నారు.
కార్యక్రమంలో కరిమిల్ల సంపత్‌రావు, జన్ను రాములు, ప్రభాకర్, రాము నాయక్, సంతోష్ నాయక్, రమేష్, నరేశ్‌తోపాటు యువత, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
🏠 Home