రాజేంద్రనగర్ : హైదరాబాద్లో ఏటీఎం దోపిడీ కలకలం రేపింది. రాజేంద్రనగర్ సాతంరై వద్ద ఉన్న యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంను దొంగలు గ్యాస్ కట్టర్లతో కట్ చేసి అందులోని నగదును ఎత్తుకెళ్లారు. ముందస్తు పథకం ప్రకారం గ్యాస్ కట్టర్లు వెంట తెచ్చుకున్న దుండగులు ఏటీఎం యంత్రాన్ని కోసి నగదు బాక్సును తెరిచినట్లు తెలుస్తోంది. అనంతరం అందులో ఉన్న సుమారు రూ.32 లక్షల నగదును దోచుకుని పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు సేకరించారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తూ దుండగుల కోసం గాలింపు చేపట్టారు. దోపిడీ వెనుక అంతర్రాష్ట్ర ముఠా ఉందా? అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.