సాంగ్లీ: మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా ఉమది ప్రాంతంలో వ్యవసాయ బావిలో పెట్రోల్ లాంటి ద్రవం కనిపించడం కలకలం రేపుతోంది. బావిలోని ద్రవాన్ని బయటకు తీసి నిప్పంటించగా మండుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏడాది కాలంగా బావి నీటిలో ఫ్యూయల్ వాసన వస్తోందని స్థానికులు చెబుతున్నారు. తాజాగా నీటిపై ఇంధనం మాదిరి ద్రవం కనిపించడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. సమీపంలోని పెట్రోల్ బంక్ కేవలం 300 మీటర్ల దూరంలో ఉండటంతో భూగర్భ లీకేజీ జరిగి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే అధికారులు తనిఖీలు నిర్వహించి బంక్ నుంచి ఎలాంటి లీకేజీ లేదని గుర్తించారు. బావిలోని ద్రవాన్ని ప్రయోగశాలలో పరీక్షించిన తర్వాతే అసలు విషయం తేలుతుందని అధికారులు తెలిపారు.