🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 06 October 2026, 7:12 pm Posted by : Telangana Gontuka

అమరులు కోరుకున్న సమాజాన్ని నిర్మించాలి... కల్వకుంట్ల కవిత

News Image
చందుర్తి : అమరులు కోరుకున్న సమాజాన్ని నిర్మించడమే వారికి మనం ఇచ్చే సరైన నివాళి అని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం సనుగులలో మంగళవారం నిర్వహించిన **‘అమరుల యాది’** కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. సబ్బండ వర్గాలు, అన్ని కులాలకు అధికారంలో సముచిత భాగస్వామ్యం దక్కినప్పుడే అమరుల త్యాగాలకు నిజమైన ఫలితం లభిస్తుందని పేర్కొన్నారు. సమాజం కోసం ఓ వ్యక్తి తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడుతుంటే, ఆయన కుటుంబ సభ్యులు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారో తనకు తెలుసని కవిత అన్నారు. తెలంగాణ సాధన కోసం కేసీఆర్‌ నిమ్స్‌లో 11 రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన సమయంలో కుటుంబ సభ్యులుగా తాము అనుభవించిన ఆవేదన తనకు మాత్రమే తెలుసన్నారు. ప్రస్తుతం కేసీఆర్‌తో రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ, మార్గాలు వేరైనా తెలంగాణ కోసం ఆయన చేసిన త్యాగాన్ని మర్చిపోవద్దని అన్నారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరులను మాత్రమే కాకుండా, మంచి సమాజం కోసం అప్పట్లో ఈ ప్రాంతంలో ప్రాణాలు కోల్పోయిన మావోయిస్టులను కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వారు ఆకాంక్షించిన సమాజాన్ని నిర్మించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
#అందరికీ తెలంగాణ ఫలాలు అందాయా?
అమరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో ఆ ఫలాలు నిజంగా అందరికీ దక్కాయా? అనే అంశాన్ని సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని కవిత అన్నారు. తెలంగాణ ఏర్పడి 13 ఏళ్లు గడిచినా పేదలు మెరుగైన విద్య, వైద్యం కోసం ఇప్పటికీ పోరాడాల్సిన పరిస్థితి ఉందని పేర్కొన్నారు. **“ఇదేనా మనం కోరుకున్న తెలంగాణ?”** అని ప్రశ్నించారు. ఆనాడు భూస్వాములు, దొరలపై పోరాటం చేస్తే.. ప్రస్తుతం అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోపిడీ చేస్తున్న వారిపై పోరాటం చేయాల్సి వస్తోందని అన్నారు. దోపిడీ విధానం మారిందే తప్ప, దాని వెనుక ఉన్న స్వభావం మారలేదని ఆమె వ్యాఖ్యానించారు. మార్పు రావాలంటే నిరంతరం ప్రజా పోరాటాలు కొనసాగాల్సిన అవసరం ఉందన్నారు. యువత, మహిళలు రాజకీయాల్లోకి వచ్చి నిర్ణయాత్మక పాత్ర పోషించినప్పుడే పరిస్థితుల్లో మార్పు వస్తుందని కవిత అన్నారు. మాజీ మావోయిస్టులు, అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరిగేలా తమ వంతు పోరాటం కొనసాగిస్తామని ఆమె స్పష్టం చేశారు.
🏠 Home