🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 06 October 2026, 2:04 pm Posted by : Hanumkonda

19 ఏళ్ల బొగ్గు కోసం 800 ఏళ్ల రామప్పను పణంగా పెడతారా..? మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌

News Image
ములుగు : వెంకటాపూర్‌ వద్ద సింగరేణి ప్రతిపాదించిన పీవీఎన్‌ఆర్‌ ఓపెన్‌కాస్ట్‌ బొగ్గు గని ప్రాజెక్టును పూర్తిగా విరమించుకోవాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు. ఇది కేవలం మైనింగ్‌ ప్రాజెక్టు సమస్య కాదని.. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం, చారిత్రక రామప్ప చెరువు, కాకతీయుల ప్రాచీన సాగునీటి వ్యవస్థ, పరిసర గ్రామాల భవిష్యత్తుకు సంబంధించిన అంశమని ఆయన పేర్కొన్నారు. కాకతీయ హెరిటేజ్‌ ట్రస్ట్‌ నివేదిక ప్రకారం ప్రతిపాదిత గని సుమారు 300 మీటర్ల లోతు వరకు ఉండి, రామప్ప ఆలయం–చెరువుకు సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉండొచ్చని వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. భారీ యంత్రాలతో తవ్వకాలు, పేలుళ్ల వల్ల భూకంపనాలు, భూగర్భజలాల కదలికలపై ఆందోళనలు ఉన్నాయని తెలిపారు.
యునెస్కో కూడా కీలక సూచనలు..
రామప్ప ప్రపంచ వారసత్వ ప్రాంతం బఫర్‌ జోన్‌ను విస్తరించి ప్రాచీన సాగునీటి వ్యవస్థ, కాలువలు, రామప్ప చెరువును అందులో చేర్చే ప్రక్రియను యునెస్కో స్వాగతించింది. ఈ సరిహద్దు మార్పు ప్రతిపాదనను 2027 ఫిబ్రవరి 1లోపు సమర్పించాలని 2026 ప్రపంచ వారసత్వ కమిటీ సూచించింది. రామప్ప ఆలయానికి చారిత్రకంగా కాకతీయుల జలాశయం, సాగునీటి వ్యవస్థ, కాలువలు, సాగుభూములతో విడదీయరాని సంబంధం ఉందని యునెస్కో పేర్కొంది.
‘బొగ్గుకు ప్రత్యామ్నాయం ఉంది.. రామప్పకు లేదు..!
ప్రతిపాదిత ప్రాజెక్టు సుమారు 19 ఏళ్లపాటు బొగ్గు ఉత్పత్తికి ఉద్దేశించినదైతే.. రామప్ప మాత్రం 800 ఏళ్ల చారిత్రక వారసత్వమని వినోద్‌కుమార్‌ అన్నారు. దేశంలో ఇతర ప్రాంతాల్లో బొగ్గును వెలికితీసే అవకాశాలున్నాయని, కానీ రామప్పను మరోచోట నిర్మించలేమని పేర్కొన్నారు. ముందుగా తవ్వకాలు చేపట్టి తర్వాత ప్రభావాలను అధ్యయనం చేసే విధానం వద్దని స్పష్టం చేశారు.
రామప్ప చెరువు కేవలం చారిత్రక కట్టడం మాత్రమే కాదని.. కాకతీయుల అద్భుత జలవనరుల నిర్వహణకు నిదర్శనమని ఆయన అన్నారు. ఆలయం, చెరువు, కాలువలు, భూగర్భ జలాలు, సాగుభూములు, రైతుల జీవనాధారాన్ని సమగ్రంగా రక్షించాల్సిన అవసరం ఉందన్నారు. యునెస్కో కూడా రామప్ప ఆలయ సమగ్ర వారసత్వంలో చెరువు, సాగునీటి వ్యవస్థ, పరిసర భూభాగాల ప్రాధాన్యాన్ని గుర్తించింది.
మైనింగ్‌పై సింగరేణి భిన్న వాదన...!
ఇదిలా ఉండగా, రామప్పకు మైనింగ్‌ కార్యకలాపాలతో ముప్పు ఉందన్న ప్రచారంపై సింగరేణి తాజాగా స్పందించింది. వెంకటాపూర్‌ ఓపెన్‌కాస్ట్‌ వల్ల రామప్ప దేవాలయానికి ముప్పు ఉండదని సంస్థ స్పష్టం చేసింది. మరోవైపు ములుగు జిల్లా అధికారులు ప్రాజెక్టు ప్రభావాలపై శాస్త్రీయ, పర్యావరణ అధ్యయనాల అనంతరమే తదుపరి చర్యలు చేపట్టాలని గతంలో స్పష్టం చేశారు. ‘అభివృద్ధికి వ్యతిరేకం కాదు.. వారసత్వానికి ముప్పు కలిగించే చర్యలను మాత్రమే వ్యతిరేకిస్తున్నాం’** అని వినోద్‌కుమార్‌ పేర్కొంటూ, వెంకటాపూర్‌ ఓపెన్‌కాస్ట్‌ ప్రతిపాదనను పూర్తిగా పునఃపరిశీలించాలని డిమాండ్‌ చేశారు.
🏠 Home