మహబూబాబాద్: గూడూరు మండలంలోని మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయంలో ఎలుకల బెడదతో విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఓ విద్యార్థినిని ఎలుక కరిచినప్పటికీ ఆస్పత్రికి తీసుకెళ్లలేదని, విషయాన్ని గోప్యంగా ఉంచాలని ప్రిన్సిపాల్ సూచించినట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఎలుకల నుంచి రక్షణ కోసం షూస్ ధరించి నిద్రించాలంటూ నిబంధనలు విధించినట్లు తెలిపారు. గతంలోనూ పలువురు విద్యార్థులను ఎలుకలు కరిచినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న తహసీల్దార్ హాస్టల్‌ను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. ఎలుకల సమస్యను తక్షణమే పరిష్కరిస్తామని తెలిపారు. పారిశుద్ధ్య లోపాలపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు.