హనుమకొండ: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే పదవికి రాజీనామా చేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు డిమాండ్ చేశారు. హనుమకొండలో డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామిరెడ్డి అధ్యక్షతన ఇండియా కూటమి నేతల మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల విశ్వాసం పెరిగేలా ఈసీ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని అన్నారు. అక్టోబర్ 5న అంబేద్కర్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర, 6, 7, 8 తేదీల్లో మండల స్థాయిలో నిరసనలు, తీర్మానాలు చేపడతామని తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.