🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 01 October 2026, 7:24 am Posted by : Telangana Gontuka

సైబర్‌ మోసాలపై తెలంగాణలో అవగాహన మాసం

News Image

హైదరాబాద్‌: డిజిటల్‌ లావాదేవీలు పెరుగుతున్న నేపథ్యంలో సైబర్‌ మోసాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అక్టోబర్‌ నెలలో ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా అక్టోబర్‌ 1న హైదరాబాద్‌లోని నెక్లెస్‌ రోడ్‌ పీపుల్స్‌ ప్లాజా వద్ద 2 కిలోమీటర్ల సైబర్‌ సేఫ్టీ నైట్‌ వాక్‌ నిర్వహించనున్నారు.

‘డిజిటల్‌ సేఫ్టీ ఫర్‌ ఫ్యామిలీస్‌’ అనే అంశంతో ఈ నెలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అక్టోబర్‌ 1న జరిగే కార్యక్రమాన్ని ‘సైబర్‌ సెక్యూరిటీ ఫ్లాష్‌–పాజ్‌ ఫర్‌ సేఫ్టీ’గా నిర్వహించనున్నారు. ప్రజలు మొబైల్‌ ఫ్లాష్‌లైట్లు వెలిగించడం ద్వారా సైబర్‌ మోసాలపై అప్రమత్తతకు ప్రతీకగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

సైబర్‌ నేరగాళ్లు రోజురోజుకూ కొత్త పద్ధతులను ఉపయోగిస్తున్నారు. బ్యాంకు ఖాతాలు, ఓటీపీలు, యూపీఐ, సోషల్‌ మీడియా ఖాతాలు, వాట్సాప్‌, ఉద్యోగాలు, రుణాలు, పెట్టుబడుల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అత్యవసరంగా డబ్బు కావాలంటూ పరిచయస్తుల పేరుతో వచ్చే మెసేజ్‌లు కూడా మోసాలకు ఉపయోగపడుతున్నాయి.

ఇలాంటి సందర్భాల్లో తొందరపడి డబ్బులు పంపకుండా ముందుగా సంబంధిత వ్యక్తికి నేరుగా ఫోన్‌ చేసి వివరాలను నిర్ధారించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అనుమానాస్పద లింకులు తెరవకపోవడం, ఓటీపీ లేదా పాస్‌వర్డ్‌ ఇతరులకు చెప్పకపోవడం, సోషల్‌ మీడియా ఖాతాలకు అదనపు భద్రతా చర్యలు తీసుకోవడం అవసరం.

అక్టోబర్‌ నెలంతా పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు, కుటుంబాలు, వివిధ వర్గాల్లో అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు TGCSB తెలిపింది. సైబర్‌ మోసాలను అరికట్టడంలో సాంకేతిక చర్యలతో పాటు ప్రజల అప్రమత్తత కూడా కీలకమనే సందేశాన్ని ఈ కార్యక్రమం ఇవ్వనుంది.
🏠 Home