ఇల్లంద KGBV లో ఏం జరుగుతోంది.?
*గతంలోనూ మిక్సీ బ్లేడ్‌తో...
వంటశాలలో వినియోగించే పరికరాల భద్రతపై గతంలోనూ ఆందోళనలు వ్యక్తమైనట్లు సిబ్బంది పేర్కొంటున్నారు. మిక్సీతో పనిచేస్తుండగా బ్లేడ్ ఊడిపోయి ఓ సిబ్బంది వేలికి గాయమైన ఘటన గతంలో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో ప్రమాదం జరిగినప్పటికీ పరికరాల పూర్తి స్థాయి తనిఖీ, మరమ్మతులు, భద్రతా చర్యలపై తగిన దృష్టి పెట్టలేదని సిబ్బంది ఆరోపిస్తున్నారు.
*ప్రమాదం జరిగిన తర్వాతే స్పందించాలా?*
వంటశాలలో ఉపయోగించే మిక్సీలు, స్టౌలు, వేడి నీటి పరికరాలు, విద్యుత్ కనెక్షన్లు తదితరాలను ఎప్పటికప్పుడు పరిశీలించి లోపాలను గుర్తించి సరిచేయాల్సి ఉన్నప్పటికీ ఆ దిశగా తగిన చర్యలు లేవనే విమర్శలు ఉన్నాయి. చిన్నపాటి లోపాలను నిర్లక్ష్యం చేస్తే అవే పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే ముందుగానే పరికరాలను తనిఖీ చేసి ప్రమాదాలను నివారించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని వారు పేర్కొంటున్నారు.
*ప్రత్యేక అధికారి తీరుపై విమర్శలు..
వసతిగృహంలో చిన్నచిన్న మరమ్మతులు, వంట పరికరాల నిర్వహణ తదితర అంశాలపై ప్రత్యేక అధికారి తగిన శ్రద్ధ చూపడం లేదని కొందరు సిబ్బంది ఆరోపిస్తున్నట్లు సమాచారం. సిబ్బంది సమస్యలను పట్టించుకోకుండా కఠినంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
"*నాకేం తెలియదు" అంటూ సమాధానం?*
గతంలో మిక్సీ బ్లేడ్ ఊడిపోయి సిబ్బంది వేలికి గాయం అయిన ఘటనపై వివరణ కోసం ప్రత్యేక అధికారిని ఫోన్లో సంప్రదించగా.. "నాకేం తెలియదు.. ఆరోపించిన వారిని అడగండి" అని సమాధానం ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈ ఘటనపై అధికారికంగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
*ఏళ్లుగా ఒకేచోట విధులా?*
ఇదిలా ఉండగా.. వసతిగృహంలో కొంతమంది సిబ్బంది ఏళ్లుగా ఒకేచోట విధులు నిర్వహిస్తున్నారని, బదిలీల వ్యవస్థ సక్రమంగా అమలు కావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపైనా ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతున్నారు.
*ఉన్నతాధికారులు స్పందించాలి..
తాజాగా వంట సిబ్బందికి గాయాలైన ఘటన నేపథ్యంలో కస్తూరిబా వసతిగృహంలోని వంటశాలను పూర్తిస్థాయిలో తనిఖీ చేయాలని, మిక్సీలు, స్టౌలు, విద్యుత్ వ్యవస్థ, వేడి నీటి పరికరాలు, ఇతర మౌలిక వసతుల పనితీరును పరిశీలించాలని సిబ్బంది కోరుతున్నారు. లోపాలు గుర్తిస్తే వెంటనే మరమ్మతులు చేపట్టి, భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా భద్రతా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.