🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 28 September 2026, 8:05 pm Posted by : Telangana Gontuka

మెడికల్‌ స్థానికతపై ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నించిన కవిత

News Image
హైదరాబాద్‌: మెడికల్‌ విద్యార్థుల స్థానికత అంశంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర విద్యార్థులకు నష్టం జరిగే ప్రమాదం ఉందని తెలంగాణ రక్షణ సేన చీఫ్‌ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు అన్ని రంగాల్లో సంపూర్ణ హక్కులు కల్పించేందుకే రాష్ట్రం సాధించుకున్నామని, అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఒక్కొక్కటిగా రక్షణలను తొలగిస్తోందని ఆమె విమర్శించారు. మెడికల్‌ సీట్లకు సంబంధించి స్థానికత నిబంధనల్లో మార్పుల కారణంగా తెలంగాణ విద్యార్థుల కంటే ఇతర రాష్ట్రాల విద్యార్థులకు ప్రయోజనం కలిగే పరిస్థితి ఏర్పడుతోందని కవిత పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ అంశాన్ని సరిదిద్దాల్సిందిపోయి సుప్రీంకోర్టులో తన నిర్ణయాన్ని సమర్థిస్తోందని ఆరోపించారు. గతంలో జారీ చేసిన జీఓ 33ను మరింత విస్తరిస్తూ జీఓ 150 తీసుకొచ్చారని ఆమె అన్నారు. 1 నుంచి 7వ తరగతి వరకు తెలంగాణలో చదివిన విద్యార్థులను స్థానికులుగా పరిగణించాల్సి ఉండగా, 8 నుంచి 12వ తరగతి వరకు చదివిన వారిని స్థానికులుగా పరిగణించే విధానం తీసుకొచ్చారని విమర్శించారు. అయితే ప్రస్తుత నిబంధనలు, వాటిపై న్యాయస్థానాల తీర్పులు నిర్దిష్ట అర్హతలు, మినహాయింపులను నిర్దేశిస్తున్నాయి. ఈ అంశం ప్రస్తుతం మెడికల్‌ సీట్లకే పరిమితమైనప్పటికీ భవిష్యత్తులో ఇతర రంగాలకు విస్తరించే అవకాశం ఉందని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే స్థానికత కారణంగా గ్రూప్‌-1లో ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు అవకాశం లభించిందని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ప్రొఫెసర్‌ కోదండరామ్‌, మేధావులు, విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. జీఓలను వెనక్కి తీసుకునేలా తెలంగాణ సమాజం పోరాటం చేయాలని కవిత కోరారు.
🏠 Home