హైదరాబాద్: నకిలీ కరెన్సీ నోట్లను చలామణి చేస్తున్న ఆరోపణలపై గోషామహల్ పోలీసులు రాజస్థాన్‌కు చెందిన విక్రమ్ (21)ను అరెస్టు చేశారు. బేగంబజార్ ఛత్రి వద్ద అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించగా.. చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారుల వద్ద రూ.500 నకిలీ నోటు ఇచ్చి వస్తువులు కొనుగోలు చేసి, అసలు డబ్బు రూపంలో చిల్లర తీసుకునేవాడని పోలీసులు తెలిపారు. అతడి వద్ద రూ.8 వేల విలువైన 16 నకిలీ రూ.500 నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ నోట్లు అశోక్ అనే వ్యక్తి నుంచి తీసుకున్నట్లు విక్రమ్ చెప్పాడని పోలీసులు తెలిపారు. అశోక్ పరారీలో ఉండగా, అతడి కోసం గాలిస్తున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.