హన్మకొండ: తెలుగు సంస్కృతి, కళలను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. కాళోజీ కళాక్షేత్రంలో భాషా, సాంస్కృతిక శాఖ, శ్రీ శాంతి కృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘కాకతీయ కళా వైభవం’ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళారంగం, ప్రజాసేవలో విశిష్ట సేవలందిస్తున్న ఈగ మల్లేశంను సత్కరించి ‘కాకతీయ కీర్తి పురస్కారం’ అందజేశారు. కాకతీయుల కళా వైభవం, ఒగ్గుకథ, చిందు యక్షగానం, పెరిణి, బతుకమ్మ, బోనాలు వంటి జానపద కళలను భావితరాలకు అందించాలని మల్లేశం పిలుపునిచ్చారు. కళాకారుల సంక్షేమానికి తమ మండలి అండగా ఉంటుందని తెలిపారు.