మంచిర్యాల: నస్పూర్ గేటు వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మందమర్రి మండలం పొన్నారం, గుడిపల్లి గ్రామాలకు చెందిన ఏడుగురు మహిళలు మంచిర్యాలలోని షాపింగ్ మాల్లో పనికి వెళ్లేందుకు ఆటోలో బయలుదేరారు. నస్పూర్ గేటు వద్ద రోడ్డు దాటుతుండగా మంచిర్యాల నుంచి జైపూర్ వైపు వేగంగా వెళ్తున్న లారీ ఆటోను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటో నుజ్జునుజ్జయింది. ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడిన ఐదుగురిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.