🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 27 September 2026, 8:00 pm Posted by : Telangana Gontuka

ఇందిరమ్మ ఇల్లు వస్తుందన్న ఆశతో ఇల్లు కూల్చేస్తే..

News Image
స్టేషన్‌ఘన్‌పూర్‌: ఇందిరమ్మ ఇల్లు మంజూరైందన్న ఆశతో శిథిలావస్థలో ఉన్న పాత ఇంటిని కూల్చుకున్న వృద్ధ దంపతులకు చివరకు నిరాశే మిగిలింది. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం ఇప్పగూడెంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కొలిపాక వెంకటయ్య, వెంకటమ్మ దంపతులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైనట్లు పత్రం అందజేశారు. జూన్‌లో గ్రామంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేతుల మీదుగా వెంకటమ్మకు మంజూరు పత్రం అందించారు. అనంతరం సర్పంచ్‌ మందపురం రాణి అనిల్‌ ఆధ్వర్యంలో కొత్త ఇంటి నిర్మాణానికి భూమిపూజ కూడా చేశారు. ఇల్లు వస్తుందన్న సంతోషంతో దంపతులు శిథిలావస్థలో ఉన్న పాత పెంకుటిల్లును కూల్చేసుకున్నారు. నిర్మాణ పనులు ప్రారంభించేందుకు సిద్ధమైన సమయంలో అధికారులు ఇల్లు మంజూరు కాలేదని చెప్పడంతో దంపతులు షాక్‌కు గురయ్యారు. దీంతో నిలువ నీడ కోల్పోయి బంధువుల ఇంటి ముందున్న రేకుల షెడ్డులో తలదాచుకుంటున్నారు. వర్షానికి తడుస్తూ, చలికి వణుకుతూ దయనీయ పరిస్థితుల్లో జీవిస్తున్నామని వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంజూరు పత్రం జారీ విషయంలో ఎక్కడ పొరపాటు జరిగిందో అధికారులు గుర్తించి వెంటనే సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
🏠 Home