🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 27 September 2026, 7:55 pm Posted by : Telangana Gontuka

కాంగ్రెస్‌ దిగజారుడు రాజకీయాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది: రావు పద్మారెడ్డి

News Image
హనుమకొండ: రాబోయే ఎన్నికల్లో వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ నియోజకవర్గ నాయకురాలు రావు పద్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హంటర్‌ రోడ్డులోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె, జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్‌రెడ్డి, 59వ డివిజన్‌ మాజీ కార్పొరేటర్‌ గుజ్జుల వసంత మహేందర్‌రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్‌ నాయకులు అధికార మదంతో బీజేపీ కార్యకర్తలపై, మహిళలపై దాడులకు పాల్పడుతున్నారని రావు పద్మారెడ్డి ఆరోపించారు. 59వ డివిజన్‌లో మాజీ కార్పొరేటర్‌ గుజ్జుల వసంత మహేందర్‌రెడ్డిపై జరిగిన దాడిని ఖండించారు. అభివృద్ధి పనులు చేపట్టకుండా శంకుస్థాపనలకే పరిమితమవుతున్నారని, 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనులను కూడా తమ ఖాతాలో వేసుకుంటున్నారని విమర్శించారు. కాకతీయ యూనివర్సిటీ ప్రహరీ నిర్మాణ వ్యయం రూ.7.5 కోట్ల నుంచి రూ.15.7 కోట్లకు పెరగడంపై ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర మంత్రులపై విమర్శలు చేయడం మానుకుని నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీపై రాహుల్‌గాంధీ వ్యాఖ్యలను కొలను సంతోష్‌రెడ్డి తప్పుబట్టారు. కేంద్రం, కేంద్ర మంత్రుల కృషితో వరంగల్‌ ప్రాంతానికి పలు అభివృద్ధి పనులు వచ్చాయని పేర్కొన్నారు. 59వ డివిజన్‌లో అభివృద్ధిని ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని గుజ్జుల వసంత మహేందర్‌రెడ్డి ఆరోపించారు. సమావేశంలో బీజేపీ నాయకులు సండ్ర మధు, నర్మెట్ట శ్రీనివాస్‌రావు గౌడ్‌, సంపత్‌రెడ్డి, మలోత్‌ నానునాయక్‌, మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
🏠 Home