జొహాన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాలోని జొహాన్నెస్‌బర్గ్ సమీపంలో దారుణ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. వెస్ట్‌రాండ్ జిల్లాలోని ఓ పబ్‌లో శనివారం సాయంత్రం దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 17 మంది మృతి చెందగా, మరో 15 మంది గాయపడ్డారు. మృతుల్లో 13 మంది పురుషులు, నలుగురు మహిళలు ఉన్నారు. పిస్టల్స్, ఏకే-47 తుపాకులతో వచ్చిన దుండగులు తొలుత పబ్ బయట ఉన్నవారిపై కాల్పులు జరిపి, అనంతరం లోపలికి వెళ్లి కాల్పులకు తెగబడ్డారు. కొందరి సెల్‌ఫోన్లు తీసుకుని రెండు వాహనాల్లో పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు కారణం తెలియరాలేదు. నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది.