కోస్గి: బీసీలకు రాజ్యాధికారం దక్కే వరకు పోరాటం ఆగదని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. బీసీ రాజ్యాధికార యాత్రలో భాగంగా కోస్గిలో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డిపై 80 శాతం ప్రజా వ్యతిరేకత ఉందని మల్లన్న పేర్కొన్నారు. 2.36 లక్షల ఓట్లలో 1.36 లక్షలు బీసీలవేనని, రెడ్ల ఓట్లు 12 వేల వరకు మాత్రమే ఉన్నాయని అన్నారు. బీసీల ఓట్లతోనే రెడ్డి, వెలమల రాజకీయ ఆధిపత్యం కొనసాగుతోందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ 42 శాతం బీసీ రిజర్వేషన్ల హామీని అమలు చేయలేదని, బీసీలకు రూ.20 వేల కోట్ల బడ్జెట్ హామీ ఏమైందని ప్రశ్నించారు. ముదిరాజ్‌లను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి, వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలోకి తీసుకెళ్తామన్న హామీలు నెరవేరలేదన్నారు. రైతు భరోసా, రుణమాఫీ, రైతుబీమా, ఆర్టీసీ విలీనం హామీలపైనా ప్రభుత్వాన్ని నిలదీశారు. బీసీలపై అక్రమ కేసులు పెడితే తానే పోలీస్ స్టేషన్‌కు వస్తానని హెచ్చరించారు. 2028లో కొడంగల్ నుంచి బీసీ బిడ్డను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే రేవంత్‌రెడ్డి రాజకీయ సమాధికి కొడంగల్ నుంచే పునాది వేస్తామని మల్లన్న వ్యాఖ్యానించారు. బీసీలు ఐక్యంగా నిలిచి తమ రాజకీయ ప్రాతినిధ్యం కోసం పోరాడాలని కోరారు.