🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 27 September 2026, 7:21 am Posted by : Telangana Gontuka

కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు.. పర్యాటక సిరి మన దేశం!

News Image
న్యూఢిల్లీ: మంచుకొండలు.. సముద్ర తీరాలు.. ఎడారులు.. దట్టమైన అడవులు.. చారిత్రక కోటలు.. అద్భుతమైన దేవాలయాలు.. బౌద్ధ క్షేత్రాలు.. గిరిజన సంస్కృతి.. నదులు, జలపాతాలు.. ఇలా ప్రకృతి, చరిత్ర, ఆధ్యాత్మికత, సంస్కృతి కలగలిసిన పర్యాటక సంపద భారతదేశానికి ప్రత్యేకత. సెప్టెంబర్‌ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా దేశ పర్యాటక వైభవంపై మరోసారి దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
ఉత్తర భారతదేశంలో హిమాలయాలు ప్రధాన పర్యాటక ఆకర్షణగా నిలుస్తున్నాయి. జమ్మూకశ్మీర్‌లోని లోయలు, హిమాచల్‌ప్రదేశ్‌లోని మంచు పర్వతాలు, ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్‌ క్షేత్రాలు ప్రకృతి, ఆధ్యాత్మిక పర్యాటకానికి కేంద్రాలుగా ఉన్నాయి. లడఖ్‌ ప్రాంతంలోని ఎత్తైన పర్వతాలు, సరస్సులు, బౌద్ధ మఠాలు సాహస పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.
రాజస్థాన్‌ కోటలు, రాజభవనాలు, ఎడారి సంస్కృతి దేశ చరిత్రను ప్రతిబింబిస్తున్నాయి. జైపూర్‌, ఉదయ్‌పూర్‌, జైసల్మేర్‌, జోధ్‌పూర్‌ వంటి నగరాలు వారసత్వ పర్యాటకానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయి. ఆగ్రాలోని తాజ్‌మహల్‌, ఢిల్లీ చారిత్రక కట్టడాలు, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి, అయోధ్య, సారనాథ్‌ వంటి ప్రాంతాలు ఆధ్యాత్మిక, చారిత్రక పర్యాటకానికి ప్రముఖ కేంద్రాలుగా నిలుస్తున్నాయి. సారనాథ్‌ 2026లో యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేరడంతో భారత్‌ ప్రపంచ వారసత్వ సంపదల సంఖ్య 45కి చేరింది.
మధ్య భారతదేశంలో మధ్యప్రదేశ్‌ ఖజురహో, సాంచి, జాతీయ ఉద్యానవనాలు, మహారాష్ట్రలో అజంతా–ఎల్లోరా గుహలు, ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టెర్మినస్‌, గుజరాత్‌లోని స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ, రణ్‌ ఆఫ్‌ కచ్‌ వంటి ప్రాంతాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. పశ్చిమ భారతదేశంలోని గోవా సముద్రతీరాలు, కేరళలోని బ్యాక్‌వాటర్స్‌, కర్ణాటకలోని హంపి, మైసూరు, తమిళనాడులోని మహాబలిపురం, మదురై, కన్యాకుమారి దక్షిణ భారత పర్యాటక వైవిధ్యాన్ని చాటుతున్నాయి.
తూర్పు, ఈశాన్య భారతదేశంలోనూ ప్రకృతి అందాలకు కొదవలేదు. ఒడిశాలోని కోణార్క్‌ సూర్యదేవాలయం, పశ్చిమ బెంగాల్‌లోని సుందర్‌బన్స్‌, సిక్కింలోని పర్వత ప్రాంతాలు, అసోంలోని కాజిరంగా, మేఘాలయలోని జలపాతాలు, అరుణాచల్‌ప్రదేశ్‌ పర్వతాలు పర్యాటకులకు విభిన్న అనుభూతులను అందిస్తున్నాయి.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా దక్షిణాది రాష్ట్రాల్లోనూ చారిత్రక కట్టడాలు, దేవాలయాలు, అడవులు, జలపాతాలు, సరస్సులు, తీర ప్రాంతాలు పర్యాటక రంగానికి బలంగా నిలుస్తున్నాయి. భారతదేశంలోని పర్యాటక సంపద కేవలం ప్రసిద్ధ ప్రాంతాలకే పరిమితం కాదు. ప్రతి రాష్ట్రంలోనూ ఇంకా వెలుగులోకి రాని చిన్నచిన్న కోటలు, పురాతన ఆలయాలు, గుహలు, జలపాతాలు, గ్రామీణ కళలు, గిరిజన సంప్రదాయాలు ఉన్నాయి.
పర్యాటకంతో ఉపాధి.. స్థానికులకు ఆదాయం...
పర్యాటకం కేవలం ప్రయాణం కాదు.. స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే రంగం. హోటళ్లు, రవాణా, గైడ్‌లు, హస్తకళలు, ఆహార రంగం, స్థానిక వ్యాపారాలు, కళాకారులు, గిరిజన ఉత్పత్తులకు పర్యాటకం ద్వారా మార్కెట్‌ లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వ తాజా అంచనాల ప్రకారం 2023–24లో పర్యాటక రంగం దేశ జీడీపీలో 5.22 శాతం వాటా కలిగి ఉండగా, 8.46 కోట్ల ఉద్యోగాలకు మద్దతు ఇచ్చింది. 2025లో దేశీయ పర్యాటక సందర్శనలు 428.55 కోట్లుగా నమోదయ్యాయి.
కొత్త సాంకేతికతతో కొత్త పర్యాటక ప్రపంచం...
2026 ప్రపంచ పర్యాటక దినోత్సవం థీమ్‌ “డిజిటల్‌ ఎజెండా అండ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టు రీడిజైన్‌ టూరిజం”. అంటే పర్యాటక రంగంలో డిజిటల్‌ సాంకేతికత, కృత్రిమ మేధస్సును ఉపయోగించి ప్రయాణ అనుభవాలను మరింత సులభతరం చేయడం, పర్యాటక ప్రాంతాలను ప్రపంచానికి చేరువ చేయడం లక్ష్యం. కేంద్ర ప్రభుత్వం డిజిటల్‌ టూరిజం ప్లాట్‌ఫారమ్‌లు, స్వదేశీ దర్శన్‌ 2.0, ప్రసాద్‌ వంటి కార్యక్రమాలపై దృష్టి సారిస్తోంది.
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలతో పాటు ఇంకా గుర్తింపునకు నోచుకోని ప్రాంతాలను వెలుగులోకి తీసుకురావడం, వారసత్వ కట్టడాలను కాపాడటం, ప్రకృతిని పరిరక్షించడం, స్థానికులకు ఉపాధి కల్పించడం సమాంతరంగా సాగాలి. చరిత్రను కాపాడుతూ.. ప్రకృతిని పరిరక్షిస్తూ.. సాంకేతికతను అందిపుచ్చుకుంటే భారత పర్యాటకం మరింత విస్తృతమైన అవకాశాలను అందుకోగలదు.
🏠 Home