పాలకుర్తి: పాలకుర్తి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, జూనియర్ కళాశాలలో ఈ నెల 22న విద్యార్థినులను ఎలుకలు గాయపరిచిన ఘటనపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకులంలో విద్యార్థుల భద్రత, కనీస ప్రథమ చికిత్స సదుపాయాలు లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని రాష్ట్ర అధికార ప్రతినిధి డా. వన్నాల వెంకటరమణ, తాడూరి శ్రీనివాస్, జాతీయ కౌన్సిల్ సభ్యుడు మార్తినేని ధర్మారావు ఆరోపించారు. బాధితులను ప్రజాప్రతినిధులు పరామర్శించకపోవడం దారుణమన్నారు. ఘటనకు బాధ్యులైన అధికారులపై సస్పెన్షన్, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, గాయపడిన విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. లేకుంటే తల్లిదండ్రులు, ప్రజాసంఘాలతో కలిసి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.