🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 26 September 2026, 10:31 pm Posted by : Telangana Gontuka

సెప్టెంబర్‌ 27 నుంచి పితృదేవతలకు శ్రాద్ధకర్మలు

News Image
ఒక తరం వెళ్లిపోతుంది.. మరో తరం వస్తుంది. కానీ తరాల మధ్య కనిపించని బంధంగా స్మృతి కొనసాగుతూనే ఉంటుంది. పూర్వీకులను స్మరించుకుంటూ వారి పట్ల కృతజ్ఞత చాటుకునేందుకు భారతీయ సంస్కృతి ప్రత్యేకంగా కేటాయించిన కాలమే పితృపక్షం లేదా మహాలయ పక్షం. భాద్రపద బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉండే ఈ రోజుల్లో పితృదేవతలకు శ్రాద్ధకర్మలు, పిండప్రదానం చేయడం సంప్రదాయంగా వస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 27న మహాలయ పక్షం ప్రారంభం కానుంది.
మనిషి పుట్టినరోజును, వివాహ వార్షికోత్సవాన్ని గుర్తు చేసుకుని వేడుకలు చేసుకుంటాం. కానీ తమకంటే ముందున్న తరాలను స్మరించుకునేందుకు ప్రత్యేకంగా ఒక పక్షాన్ని కేటాయించుకున్న అరుదైన సంస్కృతి భారతీయ సంప్రదాయంలో కనిపిస్తుంది. అందుకే పితృపక్షాన్ని కేవలం మరణించిన వారిని స్మరించే కాలంగానే కాకుండా.. జీవించి ఉన్న మనిషి తన మూలాలను గుర్తు చేసుకునే పర్వదినాలుగా పెద్దలు పేర్కొంటారు.
‘శ్రద్ధతో చేసేది శ్రాద్ధం’ అనే భావనతో పితృరుణాన్ని తీర్చుకోవడం మన సంప్రదాయంలో ముఖ్యమైన కర్తవ్యంగా భావిస్తారు. మహాలయ పక్షంలోని అన్ని రోజుల్లో లేదా కనీసం మహాలయ అమావాస్య రోజున పూర్వీకులను స్మరిస్తూ పిండప్రదానం, తర్పణాలు చేయడం ఆచారంగా కొనసాగుతోంది. ఈ ఆచారాల వెనుక కుటుంబ బంధాలు, కృతజ్ఞత, మానసిక ప్రశాంతతతో పాటు ప్రకృతిపట్ల బాధ్యత వంటి విలువలు కూడా ఉన్నాయని పండితులు చెబుతారు.
పితృపక్షానికి సంబంధించి మహాభారతంలో కర్ణుడి కథను ఉదాహరణగా చెబుతారు. యుద్ధం అనంతరం కర్ణుడు స్వర్గానికి చేరుకున్నప్పుడు అతనికి ఆహారం బదులు బంగారం, నవరత్నాలు లభించాయని పురాణగాథ. కారణం అడగగా.. జీవితకాలంలో ఎన్నో దానాలు చేసినప్పటికీ పితృదేవతలకు అన్నం, నీరు సమర్పించలేదని ఇంద్రుడు తెలిపినట్లు కథనం. దీంతో పితృదేవతలకు శ్రాద్ధం, తర్పణం చేయడం ప్రాధాన్యాన్ని ఈ కథ తెలియజేస్తుంది.
🏠 Home