ములుగు: జిల్లాలోని ఆర్‌అండ్‌బీ ప్రధాన రహదారి అధ్వానంగా మారడంతో వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. మంగపేట మండలం కమలాపురం వద్ద భారీ గుంతలో ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సు చిక్కుకోవడంతో ప్రధాన రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి ఇరువైపులా వాహనాలు బారులు తీరాయి. ఏటూరునాగారం–మంగపేట మధ్య సుమారు 10 కిలోమీటర్ల మేర రహదారి భారీ గుంతలతో నిండిపోయింది. కొన్ని చోట్ల గుంతలు ఇంకుడు గుంతలను తలపిస్తున్నాయి. దీంతో ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు, ఆర్టీసీ బస్సులు, సరుకు రవాణా వాహనాల రాకపోకలు ప్రమాదకరంగా మారాయి. గుంతలను తప్పించుకునే క్రమంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే బూర్గంపాడు–ఏటూరునాగారం ఆర్‌అండ్‌బీ రహదారిపై కనీసం తాత్కాలిక మరమ్మతులు కూడా చేపట్టకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.