🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 26 September 2026, 10:22 am Posted by : Telangana Gontuka

59 ఏళ్ల వయసులో ప్రభుత్వ టీచర్‌గా ఎంపిక

News Image
హైదరాబాద్: పట్టుదల ఉంటే వయసు అడ్డంకి కాదని ఉత్తరప్రదేశ్‌కు చెందిన విజయ్ కుమార్ శర్మ నిరూపించారు. 27 ఏళ్లుగా ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ప్రయత్నించిన ఆయనకు 59 ఏళ్ల వయసులో ఎట్టకేలకు కల నెరవేరింది.
బాగ్‌పత్ జిల్లా బడ్రవాడ్ గ్రామానికి చెందిన విజయ్ కుమార్ 1999లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సాధించేందుకు పోటీ పరీక్షలు రాయడం ప్రారంభించారు. పలుమార్లు రాత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినా ఇంటర్వ్యూలో తుది ఎంపికకు దూరమయ్యారు. TGT పరీక్షను ఆరుసార్లు, PGT పరీక్షను నాలుగుసార్లు ఉత్తీర్ణత సాధించడంతో పాటు దాదాపు ఎనిమిదిసార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్లారు.
అయినా పట్టుదల వీడకుండా గత 26 ఏళ్లుగా ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు. తాజాగా జరిగిన నియామక ప్రక్రియలో ఇంటర్వ్యూ లేకపోవడంతో రాత పరీక్ష మార్కుల ఆధారంగా ఎంపికయ్యారు. సెప్టెంబర్ 22న లక్నోలో జరిగిన కార్యక్రమంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు.
షామ్లీ జిల్లాలోని ఎయిడెడ్ సెకండరీ పాఠశాలలో TGT సంస్కృత ఉపాధ్యాయుడిగా పోస్టింగ్ పొందారు. ప్రస్తుతం ఆయన వయసు 59 ఏళ్ల 8 నెలలు. ఉపాధ్యాయుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లు కావడంతో రెండేళ్లకు పైగా సేవ చేసే అవకాశం ఉంది. 27 ఏళ్ల పాటు ఎన్నో పరీక్షలు, వైఫల్యాలు ఎదురైనా లక్ష్యాన్ని వదలకుండా కొనసాగించిన విజయ్ కుమార్ శర్మ పట్టుదలకు ఈ విజయం నిదర్శనంగా నిలిచింది.
🏠 Home