హన్మకొండ: కాజీపేట పోలీస్స్టేషన్ పరిధిలో దారుణ హత్య కలకలం రేపింది. హన్మకొండ జిల్లా కాజీపేట మండలంలోని డీజిల్ కాలనీ, బాలాజీనగర్లో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఉదయశ్రీ (40) అనే మహిళను ఆమె కుమారుడు దొరబాబు (20) కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు సమాచారం. దొరబాబు డిగ్రీ చదువుతున్నట్లు తెలిసింది. అక్రమ సంబంధం విషయంలో తల్లిని పలుమార్లు హెచ్చరించినప్పటికీ వినకపోవడంతో ఆగ్రహానికి గురైన దొరబాబు ఈ దారుణానికి పాల్పడినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న కాజీపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు దారితీసిన పూర్తి కారణాలు, ఇతర వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.