సమిష్టి కృషితో శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతం....టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు
సెప్టెంబర్ 15 నుంచి 22 వరకు ఎనిమిది రోజుల పాటు జరిగిన బ్రహ్మోత్సవాల్లో ప్రపంచవ్యాప్తంగా తరలివచ్చిన భక్తులకు వాహనసేవలతో పాటు శ్రీవారి మూలమూర్తి దర్శనం కల్పించినట్లు తెలిపారు. మొత్తం 5.76 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, హుండీ ద్వారా రూ.28.94 కోట్ల కానుకలు లభించాయి. 33 లక్షల లడ్డూలు విక్రయించగా, 21.84 లక్షల అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. 2.04 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్యమైన గరుడసేవ రోజున తిరుమలకు వచ్చిన భక్తులందరికీ దర్శనం కల్పించామని చైర్మన్ తెలిపారు. భక్తుల భద్రత కోసం 3,000 మంది పోలీసులు, 2,400 మంది విజిలెన్స్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయగా, గరుడసేవ రోజున అదనంగా మరో 1,000 మంది పోలీసులు విధుల్లో పాల్గొన్నారు. వైద్య సేవల కోసం 50 మంది వైద్యులు, 150 మంది పారామెడికల్ సిబ్బంది, 16 అంబులెన్సులను అందుబాటులో ఉంచారు. 4,000 మంది శ్రీవారి సేవకులు భక్తులకు సేవలందించారు.
బ్రహ్మోత్సవాల్లో 20 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం నుంచి 295 కళాబృందాలకు చెందిన 7,871 మంది కళాకారులు వివిధ కళారూపాలను ప్రదర్శించారు. తొలిసారిగా జర్మనీ, సింగపూర్ కళాబృందాలు ప్రదర్శనలు ఇవ్వడం విశేషమన్నారు. తిరుమలలో సుమారు 60 టన్నుల పుష్పాలు, 4 లక్షల కట్ఫ్లవర్స్తో పుష్పాలంకరణ చేపట్టారు. వాహనసేవలను భక్తులు వీక్షించేలా 36 భారీ డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.
గరుడసేవ రోజున తిరుమలలో 3,500 మంది పారిశుద్ధ్య సిబ్బంది సేవలందించగా, సుమారు 173 టన్నుల తడి, పొడి చెత్తను సేకరించి వేరు చేసి తరలించారు. భక్తుల సౌకర్యార్థం పలు కొత్త కార్యక్రమాలు, సదుపాయాలను ప్రారంభించినట్లు చైర్మన్ తెలిపారు. తిరుమల, తిరుపతిలో పచ్చదనం పెంపు, భక్తుల సేవలు, వైద్యసేవలు మరింత బలోపేతం చేసేందుకు భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు.
బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన అర్చకులు, అధికారులు, ఉద్యోగులు, పోలీసు, జిల్లా యంత్రాంగం, శ్రీవారి సేవకులు, వైద్య, పారిశుద్ధ్య సిబ్బంది, మీడియా ప్రతినిధులు, భక్తులందరికీ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు.