🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 23 September 2026, 6:27 pm Posted by : Telangana Gontuka

ఏ-320 విమానాలకు అనుగుణంగా రన్‌వే.. ఆధునిక సౌకర్యాలతో టెర్మినల్‌...Mamnoor Update

News Image
వరంగల్‌: మామునూరు విమానాశ్రయ అభివృద్ధికి సంబంధించి టెండర్‌ వివరాల్లో కీలక అంశాలు వెల్లడయ్యాయి. మామునూరు ఎయిర్‌పోర్టును డొమెస్టిక్‌ ఎయిర్‌పోర్టుగా అభివృద్ధి చేయనున్నట్లు టెండర్‌లో పేర్కొన్నారు. ఏ-320 (కోడ్‌-సీ) తరహా విమానాలు ల్యాండ్‌, టేకాఫ్‌ అయ్యేలా రన్‌వేను నిర్మించనున్నారు. ఇందుకోసం 2,500 మీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పుతో రన్‌వే ఏర్పాటు చేయనున్నట్లు టెండర్‌ వివరాల్లో ఉంది.
విమానాశ్రయంలో ప్రయాణికులకు అవసరమైన ఆధునిక సౌకర్యాలతో టెర్మినల్‌ భవనాన్ని నిర్మించనున్నారు. ఇందులో 12 చెక్‌ఇన్‌ కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఒకేసారి సుమారు 850 మంది ప్రయాణికులు కూర్చునేలా సీటింగ్‌ సౌకర్యం కల్పించనున్నారు. ప్రయాణికుల భద్రత కోసం రెండు సెక్యూరిటీ చెక్‌ పాయింట్లు ఏర్పాటు చేయనున్నారు. అదనంగా వీఐపీ, సీఐపీ లాంజ్‌లను అందుబాటులోకి తీసుకురానున్నారు.
విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులు, వారి వాహనాలకు ఇబ్బందులు లేకుండా పార్కింగ్‌ సౌకర్యాన్ని కూడా కల్పించనున్నారు. 200 కార్లు, 100 ట్యాక్సీలు నిలిపేలా ప్రత్యేక పార్కింగ్‌ ప్రాంతాలను ఏర్పాటు చేయనున్నట్లు వివరాల్లో పేర్కొన్నారు. ప్రయాణికుల లగేజీ నిర్వహణ కోసం రెండు లగేజీ కన్వేయర్‌ బెల్ట్‌లను ఏర్పాటు చేయనున్నారు.
మామునూరు విమానాశ్రయం అభివృద్ధి పూర్తయితే వరంగల్‌ నగరంతో పాటు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ప్రజలకు విమాన ప్రయాణ సౌకర్యం మరింత అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వ్యాపారం, విద్య, వైద్యం, పర్యాటకం, పారిశ్రామిక రంగాలకు విమానాశ్రయం ఉపయోగపడే అవకాశం ఉందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. టెండర్‌లో పేర్కొన్న ప్రతిపాదిత సౌకర్యాల అమలు, నిర్మాణ పనుల పురోగతిపై అధికారికంగా తదుపరి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
🏠 Home